ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ , తనకు తాను ప్రపంచ యాత్రికుడిని అని చెప్పుకునే అన్వేష్ (నా అన్వేషణ) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎన్నో దేశాలకు వెళ్లి అక్కడే వింతలు విశేషాలు తనదైన శైలిలో చెబుతూ పాపులర్ అయిన అన్వేష్, ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో అతని మీద రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. అయితే అతని మీద నమోదైన ఓ కేసు విషయంలో మాత్రం హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. ఇటీవల అన్వేష్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా హిందూ దేవతలను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Also Read :Shanmukh Jaswanth : డిప్రెషన్ మోడ్ గాయబ్.. కొత్త లవర్’ను పరిచయం చేసిన షణ్ముఖ్
ఈ నేపథ్యంలోనే బిజెపి నేత, నటి కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్వేష్ ఉద్దేశపూర్వకంగానే మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో కరాటే కళ్యాణి ఫిర్యాదుతో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు అన్వేష్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉండటంతో, అతడిని పట్టుకునేందుకు పోలీసులు వేగంగా పావులు కదుపుతున్నారు. అన్వేష్‌కు సంబంధించిన పూర్తి యూజర్ ఐడీ వివరాలు, లాగిన్ డేటా కావాలంటూ పంజాగుట్ట పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యానికి అధికారికంగా లేఖ రాశారు. విదేశాల్లో ఉన్న అన్వేష్ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే అతడికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఆ వివాదాస్పద వీడియో ఎక్కడి నుండి అప్‌లోడ్ అయింది? ఆ సమయంలో అన్వేష్ ఏ దేశంలో ఉన్నాడు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.