గోపీచంద్ సాలీడ్ హిట్ అందుకొని చాలాకాలం అయింది. అయితే, ఈ హీరోకు ఇప్పుడు జూలై సెంటిమెంట్ కలిసొస్తుందా..! అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఆయన నటించిన సినిమాలు కొన్ని జూలైలో రిలీజై హిట్ అందుకున్నాయి. అందుకే, జూలై నెలలో రిలీజ్ కాబోతున్న ‘పక్కా కమర్షియల్స సినిమాకు కలిసొస్తుందని నమ్మకంతో ఉన్నారట. ‘యజ్ఞం’, ‘సాహసం’, ‘లక్ష్యం’.. లాంటి సినిమాలు జూలైలోనే రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచాయి. అందుకే, మరోసారి అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ మారుతి దర్శకత్వంలో నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమాను జూలై మొదటి వారంలో రిలీజ్ చేయబోతున్నారు.
బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్‌గా నటించింది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘జిల్’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక మారుతి దర్శకత్వంలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా సాయి ధరం తేజ్‌తో కలిసి నటించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా కూడా హిట్ సాధించింది. ఇప్పుడు మరోసారి గోపీచంద్ – రాశీ ఖన్నా – మారుతి కలిసి చేసిన ‘పక్కా కమర్షియల్’ కూడా పక్కా సూపర్ హిట్ అనే ధీమాతో ఉన్నారు.ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ బాగానే అంచనాలు పెంచాయి. ఇటీవల వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ కూడా అందరినీ బాగా ఆకట్టుకుంది.
గోపీచంద్ గత చిత్రాలు ‘సీటీమార్’, ‘ఆరడుగుల బుల్లెట్’ ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేపోయాయి. అందుకే, ‘పక్కా కమర్షియల్’ సినిమా మీద ఆయన చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. కాగా, ఈ సినిమాను జూలై 1వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. జీఏ2 పిక్చర్స్, యువీ క్రియేషన్స్ పతాకాలపై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.