Rana Naidu 2 Shooting Update: రియల్ లైఫ్ బాబాయ్, కొడుకులు వెంకటేష్, రానా రీల్ లైఫ్ తండ్రి కొడుకులు గా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ఫ్లిక్స్ ఎక్స్ క్లూజివ్ గా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకుల నుంచి మిగతా అన్ని భాషల ప్రేక్షకుల వరకు ఒక్కసారిగా షాక్ కలిగించింది. మరీ ముఖ్యంగా వెంకటేష్, రానా ఇద్దరికీ తెలుగులో కాస్త క్లీన్ ఇమేజ్ ఉండడంతో రానా నాయుడు వెబ్ సిరీస్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఒకింత షాక్ కలిగించడమే కాదు ఏంట్రా ఇది అనిపించేలా కూడా చేసింది. బూతులు శృతిమించి ఉండడంతో తెలుగు వాళ్లయితే కొంత ఇబ్బంది పడ్డారు కూడా. ఇక ఈ వెబ్ సిరీస్ కి సీజన్ 2 కూడా ఉంటుందని సీజన్ వన్ స్ట్రీమింగ్ సమయంలో వెల్లడించారు.
Also Read; Gopichand-Prabhas: ప్రభాస్‌తో తప్పకుండా సినిమా చేస్తా.. పెళ్లి గురించి మాత్రం తెలియదు: గోపీచంద్
ఇక తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి సీజన్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతోంది. వెంకటేష్ తో పాటు రానా మీద పలు కీలక సన్నివేశాలు మొదటి షెడ్యూల్ లో షూట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజనీకాంత్ సినిమాలో రానా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరొక పక్క వెంకటేష్ సైంధవ్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా ఫైనల్ చేయలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది కానీ అధికారిక ప్రకటన వస్తే కానీ నిజమని చెప్పలేం. ‘రానా నాయుడు’లో సుర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్ళై వంటివారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ హాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘రే డొనోవన్’ కి ఇండియన్ అడాప్షన్.