మెగాస్టార్ చిరంజీవి కోడలు గానే కాదు అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలిగానూ ఉపాసనకు ఎంతో గుర్తింపు ఉంది. వైద్య, సేవా రంగాలలో కొన్నేళ్ళుగా తనదైన ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్నారు ఉపాసన. విశేషం ఏమంటే… మెగాస్టార్ కోడలిగా కొత్త బాధ్యతలను భుజానకెత్తుకున్నా ఆమె తన దిశను మార్చుకోలేదు. పైగా మరింత వేగంగానూ, మెగా ఫ్యామిలీని కలుపుకుని తన లక్ష్యం వైపు సాగుతున్నారు. అంతేకాదు… సినిమా రంగంలో ఏర్పడిన కొత్త పరిచయాలతో మరింత విస్తారంగా సేవా కార్యక్రమాలను, ఆరోగ్యానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ను చేపడుతున్నారు.
Read Also:‘ఇండియా’ వద్దు… ‘భారత్’ ముద్దు అంటున్న కంగనా!
విశేషం ఏమంటే… ప్రకృతిని ప్రేమించడం కూడా ఉపాసనకు మొదటి నుండి అలవాటు. ఏ మాత్రం సమయం చిక్కినా భర్త రామ్ చరణ్ తో కలిసి ఏదో ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి ప్రకృతితో మమేకమై వస్తుంటారు ఉపాసన. బహుశా అందుకేనేమో ఆమెను వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా సంస్థ భారత అంబాసిడర్ గా నియమించింది. ‘ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్’ కు ఇప్పుడు ఉపాసన ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్. దేశవ్యాప్తంగా ఉన్న అడవులను సంరక్షించడం, అందులోని వన్య ప్రాణులను కాపాడటం, అటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారికి బాసటగా నిలవడం ఉపాసన కర్తవ్యం. ఏ పనిని తలపెట్టినా చిత్తశుద్ధితో నెరవేర్చే ఉపాసన ఈ కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారనడంలో సందేహం లేదు.