ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తెలుగు సినిమా ప్రేక్షకులకూ సుపరిచితుడే. ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’ చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన ఉన్ని ముకుందన్ ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’లో నటిస్తున్నాడు. విశేషం ఏమంటే… ‘భాగమతి’కి ముందు అనుష్క ‘సైజ్ జీరో’ మూవీ కోసం శరీరాకృతితి మార్చుకుని, లావుగా తయారైంది. కానీ ఆ తర్వాత సన్నబడటానికి ఎంతో కృషి చేసినా పూర్తి స్థాయిలో ఫలితం దక్కలేదు. ఇప్పటికీ అనుష్క కాస్తంత లావుగానే ఉంది. ఇక ఉన్ని ముకుందన్ సైతం ‘మెప్పాడియన్’ మూవీ కోసం బరువు పెరిగాడు. అంతా ఇంతా కాదు… ఏకంగా 93 కేజీలకు చేరుకున్నాడు. అయితే… కొన్ని నెలల క్రితం ఇక సన్నబడాలనే నిర్ణయం తీసుకున్నాడు. జనవరి నుండి మొదలు పెట్టి… ఈ మూడు నెలల్లో ఏకంగా 16 కేజీల బరువు తగ్గాడట ఉన్ని ముకుందన్. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫోటోల రూపంలో తెలిపాడు. ‘మనం నిజానికి మనం అనుకునే దానికంటే పవర్ ఫుల్! నేను అనుకున్న మూడు నెలల ఫిట్ నెస్ ఛాలెంజ్ లో నాతో పాటు చాలామంది పాల్గొనడం ఆనందంగా ఉంద’ని ఉన్ని ముకుందన్ చెప్పాడు.