Hanuman Sentiment: చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లు, గ్రహస్థితులు ఏ స్థాయిలో పనిచేస్తాయో చెప్పడం కష్టం కానీ, టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక విచిత్రమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వర్సెస్ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆ పేరుతో వచ్చే సినిమాలతో పోటీ పడినా, వాటి జోలికి వెళ్లినా గురూజీకి పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. 2024 సంక్రాంతి వార్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో భారీ అంచనాలతో వచ్చిన ‘గుంటూరు కారం’ బాక్సాఫీస్ వద్ద నిలబడలేక చతికిలపడింది. సుమారు 132 కోట్ల బిజినెస్ చేసిన ఆ చిత్రం, పూర్తిస్థాయిలో రికవరీ సాధించలేక నిరాశపరిచింది. సరిగ్గా అదే టైంలో చిన్న సినిమాగా వచ్చి, కేవలం రూ. 29 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో బరిలోకి దిగిన ప్రశాంత్ వర్మ-తేజ సజ్జాల ‘హను-మాన్’ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ దెబ్బతో గురూజీ ప్లానింగ్ పూర్తిగా తలకిందులైంది.
ఇటీవల హిందీలో రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి దాదాపు రూ. 400 కోట్లు వసూలు చేసిన డివోషనల్ మూవీ ‘హనుమాన్ అంశ’పై త్రివిక్రమ్ కన్నుపడింది. ఈ చిత్రాన్ని స్వయంగా ఆయనే తెలుగులో సెప్టెంబర్ 18న రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హొంబలే ఫిలిమ్స్ రంగంలోకి దిగి, మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సహకారంతో అక్టోబర్ 9న విడుదల తేదీని ఖరారు చేసింది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. అక్టోబర్ 9న గురూజీ డైరెక్షన్‌లో రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల హనుమాన్ అంశకు లైన్ క్లియర్ చేస్తూ ఆదర్శ కుటుంబం వాయిదా పడింది. ఈ పరిణామంపై మైత్రీ రవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా హనుమాన్ వర్సెస్ గురూజీ గా సాగుతున్న ఈ ప్రచారనికి మరింత ఆజ్యం పోశాయి. “దేవుళ్లే తమ దారులను తాము క్లియర్ చేసుకుంటున్నారు, అక్టోబర్ 9న ఎలాంటి అడ్డంకులూ లేకుండా సినిమా వస్తోంది” అంటూ ఆయన పరోక్షంగా వేసిన సెటైర్లు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. ఒకసారి పోటీ పడి ఆర్థికంగా నష్టపోతే, ఈసారి అసలు తెరపైకి రాకముందే తప్పుకోవాల్సి వచ్చిందంటూ నెటిజన్లు గురూజీని ఒక రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.
‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ మరో గందరగోళానికి దారితీసింది. అక్టోబర్ 30న రిలీజ్ అంటూ ఫస్ట్ రిలీజ్ డేట్‌ని వెల్లడించి, ఆపై వెంటనే దాన్ని ఎడిట్ చేసి ఎమోజీతో మార్చడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవేళ ఈ చిత్రం నిజంగానే అక్టోబర్ 30న వస్తే, దాదాపు 10 రోజులకు పైగా ఉండే దసరా సెలవుల భారీ అడ్వాంటేజ్‌ను చేజేతులా వదులుకున్నట్లే. పండుగ సీజన్ తప్పిపోతే, సినిమాకు అద్భుతమైన మౌత్ టాక్ వస్తే తప్ప బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ దక్కడం అసాధ్యం. అప్పటివరకు కేవలం వీకెండ్ కలెక్షన్లతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. మొదటినుంచీ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్న తమన్ ప్రచారంలో ఉన్న వాస్తవమెంతో నెలాఖరుకల్లా తేలిపోనుంది. మొత్తానికి, ‘హనుమాన్’ టైటిల్ పడిన ప్రతిసారీ త్రివిక్రమ్‌కు అదృష్టం కలిసిరావడం లేదన్న టాక్ మాత్రం టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

