Tollywood: సినిమా నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే లైట్ తీసుకోవడం.. తెలుగు ఆడియన్స్‌కు అలవాటైన పద్ధతి. కానీ ఇప్పుడు థియేటర్లలో బొమ్మ పడకముందే ‘ఫ్లాప్’ అనే టాక్ బయటకు వస్తోంది. టీజర్ రిలీజ్ అవ్వగానే వందల కొద్దీ ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. చిత్రం ఏంటంటే.. ఇదంతా కావాలని, డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తున్నారంటూ తాజాగా విజయ్ దేవరకొండ, గతంలో నాని, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు నేరుగానే గళమెత్తారు. అసలు ఈ హీరోల మీదే ఎందుకు ఇంతలా పడుతున్నారు? తెరవెనుక కూర్చుని ఈ విషప్రచారాన్ని నడిపిస్తున్న ఆ పెద్ద తలకాయలు ఎవరు? అనే డౌట్ ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తుంది.
విజయ్ దేవరకొండ స్టేజ్ మీద మైక్ పట్టుకుంటే చాలు, మాట్లాడినదాన్ని వక్రీకరించి ట్రోల్ చేయడం అలవాటైపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం సినిమా రిలీజ్ అవుతుందంటే అంతకుముందే ఫేక్ రివ్యూలు, నెగెటివ్ ట్రెండ్స్ మొదలైపోతున్నాయని ఆయన ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రిలీజ్ అయిన ‘క’ సినిమా టైంలో స్టేజీపై కిరణ్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. “నేను ఎవరి అవకాశాలూ లాక్కోవడం లేదు కదా, నామీద ఎందుకు ఇంత పగ?” అని అడిగిన ప్రశ్న ఎవరికైనా బాధ కలిగిస్తుంది. నాని, సందీప్ కిషన్ కూడా తమ సినిమాలపై ప్లాన్‌గా, పద్ధతి ప్రకారం నెగెటివిటీని రుద్దుతున్నారని పలుమార్లు ఆవేదన చెందారు. వీరందరిలో ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్.. వీళ్లంతా ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, తమ సొంత కష్టంతో ఎదిగినవాళ్లే కావడం. ఒకరిద్దరు కుర్రాళ్లు సోషల్ మీడియాలో సరదాగా చేసే ట్రోలింగ్ అయితే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. కానీ సినిమా ఫస్ట్ షో అవ్వకుండానే ఒకే రకమైన ట్వీట్లు, ఒకే మూసలో ఉండే వీడియోలు కుప్పలుతెప్పలుగా రావడం వెనుక భారీగా డబ్బు చేతులు మారుతోందన్నది కాదనలేని నిజం అని సినీ సర్కిల్స్‌లోనే చర్చించుకుంటున్నారు. ఇండస్ట్రీలో దీనిపై ప్రధానంగా మూడు అనుమానాలు వినిపిస్తున్నాయి.
ఇండస్ట్రీలో కొన్ని స్థానాలు తమకే సొంతం అనుకునేవాళ్లకు, ఈ సెల్ఫ్-మేడ్ హీరోలు వరుసగా హిట్లు కొడుతూ ఎదుగుతుంటే మింగుడుపడటం లేదనేది ఓపెన్ సీక్రెట్‌గా చర్చించుకుంటున్నారు. విజయ్ యూత్ క్రేజ్ తెచ్చుకున్నా, నాని వరుస ప్రయోగాలతో పాన్-ఇండియా మార్కెట్ వైపు వెళ్లినా, కిరణ్, సందీప్ మినిమమ్ గ్యారెంటీ వసూళ్లతో నిలదొక్కుకున్నా.. రేపు తమ మార్కెట్ ఎక్కడ దెబ్బతింటుందోనన్న అభద్రతా భావంతోనే కొందరు పెయిడ్ గ్రూపులను మేపుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఫలానా హీరో సినిమా వస్తుందనగానే అతడిని తొక్కేయడానికి కొన్ని డిజిటల్ ఏజెన్సీలకు సుపారీ లాంటి ప్యాకేజీలు ముడుతున్నాయని అంటున్నారు. వీళ్ల పనిల్లా ఫేక్ ఐడీలతో టికెట్ బుకింగ్ యాప్స్‌లో రేటింగ్స్ తగ్గించడం, సినిమా బాగోలేదని నెగెటివ్ బజ్ క్రియేట్ చేసి ఫ్యామిలీస్ థియేటర్లకు రాకుండా అడ్డుకోవడమే అని చెబుతున్నారు.
సినిమా ప్రమోషన్స్ కోసం లక్షల్లో బడ్జెట్ ఇవ్వని హీరోలు, చిన్న ప్రొడ్యూసర్లపై కక్షగట్టి ఇలా రివ్యూల పేరిట చంపేసే సోషల్ మీడియా గ్యాంగులు కూడా ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్తగా పుట్టుకొచ్చాయని ఇండస్ట్రీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. డబ్బులిచ్చి చేయించే నెగెటివ్ ప్రచారం వల్ల మొదటి రెండు రోజులు కాస్త కలెక్షన్లు తగ్గొచ్చేమో కానీ, సినిమాలో మేటర్ ఉంటే ఆడియన్స్ ఎలాగూ చూస్తారు. గతంలో ఇలాంటి ఎన్నో పెయిడ్ కుట్రలను తట్టుకుని నాని, విజయ్, కిరణ్ అబ్బవరం బాక్సాఫీస్ హిట్లు కొట్టి చూపించారు. కానీ ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకుంటున్న ఇలాంటి నటులను, సొంత పరిశ్రమలోనే ఉంటూ కొందరు ఇలా వెన్నుపోటు పొడవడం మాత్రం చిత్రసీమకు ఏమాత్రం మంచిది కాదనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా నార్మల్ ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. కష్టపడే టాలెంట్‌ను ఇలా కుట్రలతో తొక్కితే, రేపటి రోజున బయటనుంచి వచ్చే కొత్త టాలెంట్ పరిశ్రమ వైపు చూసే ధైర్యం కూడా చేయలేరని చెబుతున్నారు. ఈ పెయిడ్ బ్యాచ్ ఆటలకు సినీ పెద్దలే గట్టిగా ముగింపు పలకాలని కోరుతున్నారు.

