బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో విజయోత్సవ సభను నిర్వహించిన చిత్ర బృందం, డాకు మహారాజ్ సినిమాకి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్రమంలో సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ, “సక్సెస్ చాలా గొప్పది. అది డబ్బు పెడితే దొరకదు. సక్సెస్ అనేది ఎంతో ఎనర్జీ ఇస్తుంది. భవిష్యత్ కి భరోసాను ఇస్తుంది. ఈరోజుల్లో నిర్మాత ఒక విజయం సాధించడం అంత తేలికైన విషయం కాదు. నిర్మాతను అందరూ ఒక దేవుడిలా చూడాలి. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అందుకే నెగటివిటీని పక్కన పెట్టి, మనమందరం కలిసి మన సినిమాలకు మనమే సపోర్ట్ చేసుకోవాలి. సినిమా వెనుక నిర్మాత డబ్బుతో పాటు, ఎందరో కష్టం దాగి ఉంటుంది. కాబట్టి అలాంటి సినిమాని కాపాడే బాధ్యత మనందరికి ఉంది.
Bobby Kolli : సింగిల్ టేక్ లో బాలకృష్ణ నటన చూసి 400 మంది చప్పట్లు కొడుతూనే ఉన్నారు!
‘డాకు మహారాజ్’ సినిమా విషయానికి వస్తే, శ్రద్ధా శ్రీనాథ్ గొప్ప నటి. కళ్ళతోనే అద్భుతమైన భావాలను పలికిస్తారు. ప్రగ్యా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతారు. వేద క్యూట్ గా ఉంది. అనంత శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు గొప్ప సాహిత్యం అందించారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పని చేసిన నా మ్యూజికల్ టీంకి థాంక్స్. ఎంత ఒత్తిడి ఉన్నా అది దర్శకుడు బాబీ ఫేస్ లో కనిపించదు. నేపథ్య సంగీతం విషయంలో బాబీ చేసిన సపోర్ట్ ను మరచిపోలేను. వంశీగారు చాలా నిజాయితీగా ఉంటారు. సినిమా విషయంలో ఆయన జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుంది. సితార, హారిక హాసిని బ్యానర్స్ హిట్ కొడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. వంశీగారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. బాలకృష్ణ గారు, నా కాంబినేషన్ లో వరుసగా నాలుగు ఘన విజయాలు సాధించాము. ప్రతి సినిమాలో బాలకృష్ణ గారు నట విశ్వరూపం చూపిస్తున్నారు కాబట్టే, నేను ఆ స్థాయి సంగీతం ఇవ్వగలుగుతున్నాను. బాలయ్య గారిని ఎప్పుడు చూసినా నాకు పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. ఈ సినిమాలో బాలయ్య గారిని డీఓపీ విజయ్ కార్తీక్ గొప్పగా చూపించారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. థాంక్యూ.” అన్నారు.