మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో సంగీతం ఏ లెవెల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొదలు, పాటల దాకా ప్రత్యేక దృష్టిపెడుతారు. అంతేకాదు, సంగీత దర్శకులతోను మంచి వాతావరణం ఏర్పరచుకొని.. తనకు కావాల్సిన ట్యూన్స్ వచ్చే దాకా కథను పూర్తిగా వారి మదిలో నింపేస్తుంటారు. అందుకే ఆయన సినిమాలో సంగీతం అంత స్పెషల్ గా ఉంటుంది.
ప్రస్తుతం త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అతిత్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్ బాణీలు అందించనున్నారు. అయితే రీసెంట్ గా త్రివిక్రమ్-తమన్ ఈ సినిమాపై సమావేశం అయినట్లు తెలుస్తోంది. తమన్ కు కథను నరేట్ చేసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజులలో మ్యూజిక్ సిటింగ్స్ మొదలుపెడతారట.
ఇదివరకు వీరిద్దరూ ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాల్లో కలిసి పనిచేయడంతో మంచి బాండింగ్ ఏర్పడింది. దీంతో మహేష్ చిత్రానికి కూడా అదిరిపోయే ట్యూన్స్ అందిస్తారని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం త్రివిక్రమ్-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ లో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుండగా.. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు త్రివిక్రమ్ ప్యాకప్ చెప్పేసి మహేష్ సినిమాను మొదలుపెట్టనున్నారు.