వేతనాలు పెంచాలంటూ తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల్లోని కార్మికులు నేడు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ముందు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ… రేపటి నుంచి పెరిగిన వేతనాల లెటర్ ను కార్మికులకు ఫెడరేషన్ ఇస్తుంది. ఆ వేతనాల ప్రకారమే పనిచేస్తమని ఆయన ప్రకటించారు. ముప్పై శాతం వేతనాలు పెరగాలని, నిర్మాతలతో చర్చలు జరుపుతామన్నారు. పోలీసులకు సహకరించాలన్నారు. అయితే అనిల్ ప్రకటన తర్వాత పలువురు సినీ కార్మికులు వెళ్లిపోగా.. ఇంకా కొద్ది మంది కార్మికులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫీసు ముందు ఉన్నారు. సినీ కార్మికుల వేతనాలు ప్రతి మూడు ఏళ్లకు ఒక సారి పెరగాలని, ఈ సారి 2018 తర్వాత 2021 లో వేతనాలు పెరగాలి.కానీ ఇప్పటి వరకు పెరగలేదని వల్లభనేని అనిల్ అన్నారు. అయిన నిర్మాతల వినతితో మేము కొంత కాలం వేచి చూసామని, 2022 జనవరి నుంచి ఛాంబర్ తో మాట్లాడుతూ ఉన్నామని, ఆరు నెలల నుంచి ఛాంబర్ గుమ్మం తొక్కుతూ వస్తున్నామన్నారు.
వేతనాలు పెంచాలని ఆడిగినప్పటి నుంచి ఇతర సమస్యలు లెవనెత్తుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆరు నెలలుగా ఛాంబర్ నుంచి వేతనాల పెంపుపై ఎటువంటి స్పందన లేదని, ఈ నెల 5 నే వేతనాల పెంపుపై నోటీసు ఇచ్చాము …లేఖ ఇచ్చామన్నారు. ఇప్పుడు లేఖ రాలేదని ఛాంబర్ సభ్యులు అధ్యక్షుడు అంటున్నారని ఆయన ఆరోపించారు. రేపటి నుంచి పెంచిన జీతాలు ఇస్తేనే వారికి షూటింగ్ లో పాల్గొంటామని, సినీ పరిశ్రమలో సంక్షోభం లేదని, ఛాంబర్, కౌన్సిల్ నుంచి స్పందన లేకపోవడంతోనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఛాంబర్ నుంచి చర్చలకు పిలుపు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతల సమావేశం జరుగుతోంది. సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాత సీ కళ్యాణ్, ఏ ఎమ్ రత్నం, మైత్రి మేకర్స్ రవి, సుప్రియ యార్లగడ్డ , జెమిని కిరణ్, భారత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. సినిమా షూటింగ్స్ నిలుపుదల, సినీ కార్మికుల సమ్మె పై ప్రధాన చర్చ జరుగుతున్నట్లు సమాచారం.