తెలుగు సినీ పరిశ్రమలో గత 15 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో కార్మికులు తమ గోడును ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి విన్నవించుకున్నారు. ఈ రోజు (ఆగస్టు 18, 2025) చిరంజీవి ఫెడరేషన్ ప్రతినిధులను పిలిచి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 24 క్రాఫ్ట్స్ నుండి 72 మంది కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read : Akhanda 2: అఖండ 2 తాండవం ఆడించే ఓటీటీ ఫిక్స్?
ఈ క్రమంలో అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, “నిర్మాతలు మా మాట వినకుండా మా మీదే నిందలు వేస్తున్నారు. మాకు కుదరని నిబంధనలను విధిస్తూ, కార్మికుల పట్ల అన్యాయం చేస్తున్నారు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో, కార్మికులు తమ సమస్యలను చిరంజీవికి వివరించారు. “మేము రెండు కండీషన్స్‌కు ఒప్పుకుంటే ఎలాంటి నష్టాలు ఎదుర్కొంటామో చిరంజీవి గారికి వివరించాం. ఆదివారం నాడు డబుల్ కాల్ షీట్ విషయంలో కూడా మా అభిప్రాయం విన్నవించుకున్నాం. అలాగే, మా మీద వచ్చిన నిందలను కూడా స్పష్టంగా చెప్పుకున్నాం,” అని అనిల్ తెలిపారు. ఈ సమావేశంలో చిరంజీవి కార్మికులకు భరోసా ఇచ్చారు.
Also Read : Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాలతో కిరణ్ అబ్బవరం?
“మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు రండి. మీ సమస్యలను న్యాయంగా పరిష్కరించేందుకు సహకరిస్తాను,” అని చిరంజీవి హామీ ఇచ్చారు. ఈ సమావేశం తర్వాత, కార్మికులు తమ నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారని అనిల్ వల్లభనేని ప్రకటించారు. మరోవైపు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి కూడా కార్మిక సంఘానికి చర్చలకు పిలుపు వచ్చింది. రేపు (ఆగస్టు 19, 2025) జనరల్ బాడీ మీటింగ్‌తో పాటు ఛాంబర్‌తో సమావేశం జరగనుంది. “చర్చలకు పిలిచారు కాబట్టి, మేము నిరసన కార్యక్రమాన్ని ఆపాము. మేము అడిగిన వేతన పెంపు జరుగుతుందని ఆశిస్తున్నాం,” అని అనిల్ వల్లభనేని ఆశాభావం వ్యక్తం చేశారు. “చిరంజీవి గారు, బాలయ్య గారు మా సమస్య పరిష్కారం కోసమే మాట్లాడతారు. వారు ఎవరి వైపూ పక్షపాతం చూపరు,” అని అనిల్ తెలిపారు.