తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు త్వరలోనే నిర్వహించాలని కోరుతూ రేపు తెలుగు ఫిలిం చాంబర్ హాల్లో కొంతమంది నిర్మాతలు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నిర్మాతలు కేఎస్ రామారావు, సి కళ్యాణ్, అశోక్ కుమార్, బసిరెడ్డి వంటి వారు ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడబోతున్నారు. నిజానికి ఈ అంశం మీద ఈ నెల రెండో వారంలోనే నిర్మాతలు సమావేశం అయ్యారు. ఏడాది జులైలో జరగాల్సిన చాంబర్ ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, జులైతో ప్రస్తుత కమిటీ గడువు ముగుస్తున్నందున వెంటనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయాలని అసోసియేషన్‌లోని పలువురు నిర్మాతలు కోరుతున్నారు.
Also Read : Anirudh: హే అనిరుధ్.. ఈసారి నువ్ కాపీ కొట్టి దొరికేశావా?
కొద్దిరోజుల క్రితం సమావేశమైన నిర్మాతలు కొందరు తమ అజెండాతో సొంతంగా ఇప్పుడైనా కమిటీని కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారని, మీడియాలో సైతం అదే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు నిర్వహించాలని నిర్మాతలు అప్పట్లో కోరారు. అయితే ఇదే విషయం మీద ఆ సమయంలోనే ఫిలిం చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ వివరణ కూడా ఇచ్చారు. సాధారణంగా జులై నెలాఖరికి ఎన్నికలు జరగాలి కానీ, కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కరించాల్సి ఉండడం, కొన్ని పనుల మధ్యలోనే ఉండడంతో ఈసీ మీటింగ్‌లో మరో ఏడాది పాటు గడువు పొడిగించాలని కోరానని, మీటింగ్‌కి హాజరై వారి అభిప్రాయాలు వెల్లడించాలని ఆయన పేర్కొన్నారు. అయితే రేపు మీడియా సమావేశంలో ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.