పలు చిత్రాలలో బాలనటుడుగా రాణించి ఇటీవల కాలంలో హీరోగానూ విజయం సాధించాడు తేజ సజ్జ. సమంత ఓబేబీలో కీలక పాత్ర పోషించిన తేజ ఆ తర్వాత జాంబిరెడ్డి సినిమాలో హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన జాంబిరెడ్డి కమర్షియల్ గానూ విజయవంతం కావటంతో తేజకు వరుసగా హీరోగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే తొందర పడకుండా ఆచితూచి అడుగుతు వేస్తున్నాడు తేజ. తేజ నటించిన మలయాళ రీమేక్ ఇష్క్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను తెలుగు, తమిళ రంగాల్లో పేరున్న మెగాసూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించటం విశేషం. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఇష్క్ కరోనా పాండమిక్ వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా తేజ మరో సూపర్ బ్యానర్ వైజయంతీ మూవీస్ లో సినిమా చేయబోతున్నాడట. ఈ సంస్థ తాము తీయబోతున్న యూత్ ఫుల్ సినిమాలో తేజ సజ్జను హీరోగా ఎంపిక చేసుకుందట. దర్శకుడు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇలా వరుసగా టాప్ బేనర్స్ లో సినిమాలు చేస్తున్న తేజ ఆ సినిమాలతో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.