ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రధానిని కలవడం పట్ల ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోడీని సాక్షాత్తూ దైవాంశసంభూతుడిగా, మహనీయుల కలబోతగా అభివర్ణిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల తెలంగాణా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన తనికెళ్ల భరణి.. ఆయనతో ఆత్మీయంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ సందర్భంగా తనదైన శైలిలో గొప్ప కవితాత్మక, భక్తి భావంతో కూడిన క్యాప్షన్‌ను జతచేశారు. “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు.. ఇక మనం వారిని చూడలేము కూడా. కానీ, వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యమైంది”* అని తన అభిమానాన్ని, చాటుకున్నారు.
సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు, సాహిత్యం పట్ల ఎంతో మక్కువ చూపే తనికెళ్ల భరణి.. దేశ ప్రధానిని స్వయంగా కలవడం, ఆయనను దేవుళ్లతో సమానంగా భావిస్తూ ఉన్న ఫోటోను పంచుకోవడం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆయన చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కొందరు ఆయన భక్తి భావాన్ని, మోడీపై ఉన్న గౌరవాన్ని మెచ్చుకుంటుండగా.. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
