మిల్కీ బ్యూటీ తమన్నా రూటే సపరేటు. మోహన్ బాబు తనయుడు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా… నిజానికి ఇంతకాలం స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందని ఆ సమయంలో ఎవరూ ఊహించి ఉండరు. పాలబుగ్గల ఈ చిన్నారి… వచ్చినంత వేగంగా వెళ్ళిపోతుందనే అనుకున్నారు. కానీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే తమన్నా… నిదానంగా తన నట జీవితాన్ని పద్ధతి ప్రకారం విస్తరింపచేస్తూ, అంకిత భావంతో అనుకున్నది సాధిస్తూ ముందుకు కదిలింది. తమన్నాలో ఉన్న గొప్ప విశేషం ఏమంటే… ఏ రోజూ తానో స్టార్ హీరోయిన్ అనే భావనే మనసులోకి తెచ్చుకోదు. ఎవరు ఏమి చెప్పినా ఆలకిస్తుంది. దర్శక నిర్మాతలు అందుకే తమన్నాను మళ్ళీ మళ్ళీ ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే వెబ్ సీరిస్ లోకి అడుగుపెట్టిన తమన్నా… ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన సినిమాల్లోనూ నటిస్తోంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాస్ట్రో మూవీ గురించి. హిందీ అంథాధున్లో టాబు పోషించిన పాత్రను ఇక్కడ తెలుగులో తమన్నా చేస్తోందని తెలియగానే చాలామంది ఆశ్చర్యపోయారు. తమన్నాకు అలాంటి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. కానీ తమన్నా మాత్రం తన ఇమేజ్ ను భిన్నమైన పాత్రను ఎంపిక చేసుకుని నటిగా సత్తా చాటాలని తహతహలాడుతోంది. ఇదే తెగింపు ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా చేసేట్టుగానే ఉంది. దానికి తాజా ఉదాహరణ తమన్నా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కోసం కుకింగ్ షో కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. ‘మాస్టర్ షెఫ్’ తరహాలో సాగే ఈ కార్యక్రమం తమన్నాకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. విశేషం ఏమంటే… తమన్నా ఇక్కడ చేయబోతున్న ఈ టీవీ షో కన్నడలో కచ్చా సుదీప్ చేయబోతున్నాడట. అక్కడ మేల్ స్టార్ ను ఎంపిక చేసుకున్న కార్యక్రమ నిర్వాహకులు ఇక్కడ మాత్రం తమన్నా పైపు మొగ్గు చూపారంటే ఆమె రేంజ్ ను అర్థం చేసుకోవచ్చు!