ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘తడప్’. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఆర్.ఎక్స్. 100’కు ఇది హిందీ రీమేక్. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ట్రైలర్ ను సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు. ‘ఆహాన్… నువ్వు పెరగడం మేం చూశాం. ఇవాళ నీ తొలి చిత్రం ‘తడప్’ ట్రైలర్ తో ప్రపంచ సినిమాకు నిన్ను పరిచయం చేయడం నాకు ఆనందంగానూ, గౌరవంగానూ ఉంది. నీకు శుభకామనలు, శుభాకాంక్షలు” అని అమితాబ్ బచ్చన్ ఆ సందేశంలో పేర్కొన్నారు.
ఆహాన్ శెట్టి, తారా సుతారియా జంటగా నటించిన ‘తడప్’ చిత్రం ట్రైలర్ చూస్తుంటే, ఆ రెండు పాత్రల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన విషయం అర్థమౌతోంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని తెలుగులో కంటే కూడా చాలా భారీగా, లార్జర్ స్కేల్ లో మూవీని తీశారని తెలుస్తోంది. ఇక తెలుగు ట్రైలర్ లో ఉన్నట్టుగానే హీరోయిన్ ను, హీరో గొంతు నులమడం ట్రైలర్ లోని కొసమెరుపు. ఆహాన్ పాత్రలో అగ్రెసివ్ నెస్ కనిపిస్తే, తారా పాత్ర కాస్తంత సున్నితంగా ఉంది. మిలిన్ లూథ్రియా దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ తో కలిసి సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమాను నిర్మించాడు. ‘టాక్సీ నెం. 9211, వన్స్ అపానే టైమ్ ఇన్ ముంబై’ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మిలిన్ లూథ్రియా సునీల్ శెట్టి తనయుడికి ఏ స్థాయి విజయాన్ని అందిస్తాడో చూడాలి.