‘ఆకాశం నీహద్దురా’ సినిమాతో నటుడిగా మరోసారి తన సత్తా చాటిన సూర్య ఇప్పుడు ‘నవరస’ ఆంధాలజీతో పాటు రెండు ఫీచర్ ఫిల్మ్స్ లో నటిస్తున్నాడు. అందులో ఒకటి వెట్రిమారన్ దర్శకత్వంలో చేస్తున్న ‘వాడి వాసల్’ కాగా, రెండోది పాండిరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. శుక్రవారం సూర్య పుట్టిన రోజు సందర్భంగా అతని 40వ చిత్రం టైటిల్ ను చిత్ర బృందం ప్రకటించింది. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రానికి ‘ఎదర్కుం తనిందవన్’ అనే పేరు పెట్టారు.
విశేషం ఏమంటే… ఇదే పేరుతో 1976లో సూర్య తండ్రి శివకుమార్ ఓ సినిమాలో నటించారు. సూర్య – పాండిరాజ్ గతంలో ‘పసంగ -2, కదైకుట్టి సింగమ్’ చిత్రాలు చేశారు. వారి కాంబినేషన్ లో మూడో సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మింస్తోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాలో సత్యరాజ్, శరణ్య పొన్వన్నన్, దేవదర్శిని, జయప్రకాశ్, ఇలవరసు కీలక పాత్రలు పోషించబోతున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్.
టైటిల్ ప్రకటనతో పాటు నిర్మాతలు విడుదల చేసిన 39 సెకన్ల వీడియోతో సూర్య అభిమానుల ఆనందం అంబరాన్ని తాకుతోంది. మరి ఇరవై నాలుగు గంటలు గడిచే సరికీ సూర్య అభిమానులు ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ద్వారా ఏ కొత్త రికార్డులు సృష్టిస్తారో చూడాలి.