నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ సినిమా వేడుకలో చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ కావడమే కాకుండా, ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లోని మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ, తన వివరణ ఇచ్చిన క్రమంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తను అనవసరంగా సలహాలు ఇచ్చానని, ఇకపై ఎవరికీ ఎలాంటి సూచనలు చేయకూడదని అర్థమైందని శివాజీ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన కమిషన్ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని, తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు. ఎవరి హక్కులకు భంగం కలిగినా ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయని, ఎవరి దుస్తులు వారి ఇష్టమని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని ఆయన కోరారు.
Also Read: Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఛార్జిషీట్ దాఖలు, ఏ-11గా అల్లు అర్జున్!
తనపై కావాలనే వ్యక్తిగత కక్షతో కుట్ర పన్నుతున్నారని శివాజీ ఆరోపించారు. తన వ్యాఖ్యల తర్వాత తనను ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రత్యేకంగా ‘జూమ్ మీటింగ్’లు పెట్టుకున్నారని, ఇది తనను విస్మయానికి గురిచేసిందని ఆయన అన్నారు. తనతో కెరీర్ మొదలుపెట్టిన వారికే తనపై కోపం ఉందని, తనకు బాగా కావాల్సిన వారు ఇలా కుట్ర చేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలా మంది చేశారని, వారిని వదిలేసి తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న ప్రచారం కాదని స్పష్టం చేశారు.
Also Read:Tollywood Christmas: ఈ వారం సినిమాల కలెక్షన్స్ రేసులో దూసుకుపోతున్న ఛాంపియన్
తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ శివాజీ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు ఆత్మాభిమానం తప్ప మరేమీ ముఖ్యం కాదని చెప్పారు. ఒకవేళ సినిమాలు లేకపోయినా తాను వ్యవసాయం చేసుకుని బతకగలనని, తనది రైతు కుటుంబమని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు. భారత దేశంలో కుటుంబ వ్యవస్థ అత్యంత గొప్పగా ముందుకు వెళ్తోందని, ఇంట్లో పెద్దలు జాగ్రత్తలు చెప్పడం సహజమేనని ఆయన గుర్తు చేశారు. శివాజీ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూనే, జరిగిన పరిణామాలకు చింతిస్తున్నట్లు తెలిపారు. మహిళా కమిషన్ ఇంకా విచారణ కోరితే మళ్ళీ హాజరవుతానని, కానీ తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.