సినిమా అంటే క్రియేటివిటి మాత్రమే కాదు. కోట్లాది రూపాయల వ్యాపారం కూడా. అందుకే, కరోనా ఎఫెక్ట్ తో మీద లాక్ డౌన్స్ కారణంగా సినిమా రంగం అల్లాడిపోతోంది. థియేటర్స్ లో పాప్ కార్న్ అమ్మేవాడు మొదలు వందల కోట్లు ఖర్చు చేసే దమ్మున్న నిర్మాతల దాకా అందరికీ అతి కష్టంగా సమయం గడుస్తోంది. మరి ఈ సమయంలో పరిష్కారం ఏంటి? ఇండియాలో సెకండ్ వేవ్ కూడా కాస్త తెరిపినిచ్చింది కాబట్టి టాప్ స్టార్స్ చకచకా సినిమాలు చేయటమే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి పెద్ద ఉపశమనం…
మిగతా బాలీవుడ్ బడా స్టార్స్ సంగతి ఎలా ఉన్నా బాద్షా మాత్రం వచ్చే సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నంలో ఉన్నాడు. ‘జీరో’ సినిమా తరువాత తనకు తానే క్వారంటైన్ విధించుకున్న షారుఖ్ తరువాత ‘పఠాన్’ చిత్రం మొదలు పెట్టినా అనుకున్న విధంగా సాగటం లేదు. కరోనా లాక్ డౌన్ వల్ల కొన్నాళ్లు యాక్షన్ థ్రిల్లర్ పిక్చరైజేషన్ ఆగిపోయింది. అయితే, రీసెంట్ గా యశ్ రాజ్ స్టూడియోస్ లో కింగ్ ఖాన్ మరోసారి యాక్షన్ రీస్టార్ట్ చేశాడు. ‘పఠాన్’ చిత్రీకరణ ప్రస్తుతం ముంబైలో సాగుతోంది. తరువాత అన్నీ అనుకూలిస్తే యూరప్ లో షూటింగ్ చేస్తారట. లేదంటే ఇండియాలోనే ‘పఠాన్’ పూర్తి చేసే ఆలోచనలో నిర్మాత ఆదిత్య చోప్రా ఉన్నాడని అంటున్నారు.
‘పఠాన్’ తరువాత ఎస్ఆర్కే చేయబోయే చిత్రం పై కూడా అప్పుడే చర్చ మొదలైంది. ఒకేసారి దర్శకుడు అట్లీ, రాజ్ కుమార్ హిరానీ చిత్రాలు రెండూ మీడియాలో వినిపిస్తున్నాయి. షారుఖ్ నెక్ట్స్ ఎవరి చిత్రంలో నటిస్తాడో ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే, బాలీవుడ్ బాద్షా ‘పఠాన్’లో తన వంతు షూట్ అవ్వగానే, లైనంత త్వరగా మాత్రం, మరో సినిమా మొదలు పెట్టనున్నాడు. అలా 2022లో రెండు సినిమాలతో జనం ముందుకి రానున్నాడు.
‘పఠాన్’ వచ్చే సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో బాక్సాఫీస్ వద్దకు వచ్చేస్తుంది. ఇక అట్లీ లేదా రాజ్ కుమార్ హిరానీ సినిమాతో 2022 సెకండ్ హాఫ్ లో రాబోతున్నాడు కింగ్ ఖాన్. దివాలీ లేదా క్రిస్మస్ సందర్భంలో ఆయన రెండో చిత్రం విడుదలవుతుందట! చూడాలి మరి, మహమ్మారి మహాకల్లోలం సృష్టిస్తున్న వేళ షారుఖ్ వేసుకున్న ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో మరి….