ఎమ్ఎస్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చిన్న సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను అందుకున్న నిర్మాత. ప్రస్తుతం దిల్ రాజు ఎలాగైతే సినిమాలను తనదైన శైలిలో తెరపైకి తీసుకొస్తున్నారో అప్పట్లో ఎమ్ఎస్ రాజు కూడా దర్శకులతో ప్రత్యేకంగా మాట్లాడి సినిమాలను వెండితెరపైకి తీసుకువచ్చేవారు. ఆయన ప్రమేయం లేకుండా ఏ సినిమా కూడా వెండితెరపై కి వచ్చేది కాదనే చెప్పాలి. అలా ఒక ప్రాజెక్టు విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునేవారు.
ఎమ్ ఎస్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన దేవి, వర్షం, ఒక్కడు, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ఇలా ఎన్నో సినిమాలు వరుసగా బాక్సాఫీసును బద్దల కొట్టాయి. అయితే ఎమ్ఎస్ రాజు కొంత కాలం అనంతరం ఇతర దర్శకులతో సినిమాలు చేయకుండా సొంతంగా డైరెక్షన్ చేస్తూ ఓ వర్గం వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 7 డేస్ 6 నైట్స్ అనే మూవీ కోసం మరోసారి దర్శకుడిగా మారిన ఆయన సినిమా ప్రమోషన్ లో బిజీ అయిపోయారు.
సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం జూన్ 24 విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో MS రాజు స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోవడానికి గల కారణాన్ని చెప్పారు. ప్రస్తుతం అగ్ర హీరోలుగా ఉన్న మహేష్ బాబు, ప్రభాస్ ఇద్దరి కెరీర్ కు మొదట బూస్ట్ ఇచ్చే విధంగా అప్పట్లో భారీగానే సినిమాలని నిర్మించారు. వర్షం, ఒక్కడు సినిమాలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి.
అయితే ఆ హీరోలు ఇప్పుడు ఎమ్.ఎస్.రాజు పై కృతజ్ఞతతో సినిమా చేయకుండా ఉంటారా అనే విషయం అందరిలో హాట్ టాపిక్ మారింది. ఇక అదే విషయంపై స్పందించిన ఈ నిర్మాత.. తాను స్టార్ హీరోలు, దర్శకుల వెంట వెళ్లనని స్పష్టం చేశారు. ఒకవేళ మహేష్ బాబు, ప్రభాస్ లు ఇద్దరు కూడా పెద్ద సినిమాలు చేయమని అడిగితే తాను సినిమా చేయనని, ఎందుకంటే తనకు నచ్చినట్లు సినిమాలు తీయడం ఇష్టం అని కామెంట్ చేశారు.
ఎమ్ ఎస్ రాజు అలా కామెంట్స్ చేయడంతో ఓ వర్గం ఆడియెన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అంటే వాళ్లతో సినిమా చేసేటప్పుడు ఎమ్ ఎస్ రాజు తనకు నచ్చినట్టు తీశాడా..? లేక హీరోలకు ఇష్టం ఉన్నట్లు తీశాడా..? అంటూ ప్రేక్షకుల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. ఏదేమైనా ఓ రేంజ్ లో వున్న నిర్మాత ఎమ్ఎస్ రాజు.. మహేష్, ప్రభాష్ తో సినిమా తీయలేను అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.