Satyanarayana with SVR: యన్టీఆర్ అన్నగా అభిమానించే సత్యనారాయణ, యస్వీ రంగారావును తండ్రిగా ఆరాధించేవారు. తొలి రోజుల్లో యస్వీఆర్ తోకలసి సత్యనారాయణ నటించిన పలు చిత్రాలలో ఆయన నుండి ఏ సన్నివేశంలో ఏ డైలాగ్ ఎలా పలకాలో నేర్చుకున్నానని సత్యనారాయణ చెప్పేవారు. బాపు తెరకెక్కించిన మహత్తర పౌరాణిక చిత్రం `సంపూర్ణ రామాయణం`లో యస్వీ రంగారావు రావణాసురునిగా నటించగా, ఆయన కొడుకు ఇంద్రజిత్ పాత్రలో సత్యనారాయణ అభినయించారు. ఈ సినిమా సమయంలోనూ సత్యనారాయణకు సంభాషణలు ఎలా పలకాలో యస్వీఆర్ దగ్గరుండి మరీ ఓకొడుకుకు తండ్రి నేర్పించినట్టుగా నేర్పారట.
Read also: Satyanarayana in Hindi: హిందీలో సత్యనారాయణ!
ఆ తరువాత `దేవుడు చేసిన మనుషులు`లో ఓ సన్నివేశంలో తాగుబోతులా యస్వీఆర్ ముందు నటించడం భలేగా నవ్వు పుట్టించిందట. దాంతో యస్వీఆర్ మందలించి, మనం కాదు, పాత్ర కనిపించాలి అంటూ బోధించారని అదే ఆ తరువాత రోజుల్లో తాను ఫాలో అయ్యానని సత్యనారాయణ చెప్పేవారు. ఇక దాసరి నారాయణ రావు తొలి చిత్రం `తాత-మనవడు`లో కూడా యస్వీరంగారావు తనయునిగానే సత్యనారాయణ నటించి మెప్పించారు. `డబ్బుకు లోకం దాసోహం`లో యస్వీఆర్, సత్యనారాయణ అన్నదమ్ములుగానూ తమదైన అభినయం ప్రదర్శించారు. అలా యస్వీరంగారావుతోనూ తన అనుబంధం ప్రత్యేకమైనదేనని సత్యనారాయణ తరచూ గుర్తు చేసుకొనేవారు.