Satyadev: రెండేళ్ళ క్రితం ఆగస్ట్ మాసంలో సెట్స్ పైకి వెళ్ళింది ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రం. కన్నడ సినిమా ‘లవ్ మాక్ టైల్’ ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన ఈ మూవీలో సత్యదేవ్ సరసన తమన్నా నాయికగా నటించింది. మేఘా ఆకాశ్, కావ్య శెట్టి, సుహాసిని తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. నాగశేఖర్ దర్శకత్వంలో భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్మెస్ రెడ్డి, చిన్నబాబు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. కరోనా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్ని షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా జనం ముందుకు రావడానికి మాత్రం మీనమేషాలు లెక్కపెట్టాల్సి వస్తోంది. పలు మార్లు వాయిదా పడిన తర్వాత జూలై 15న మూవీని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత మరోసారి వాయిదా వేసి, ఆగస్ట్ 5న రావడం ఖాయమన్నారు. కానీ ఆ రోజు కూడా వెళ్ళిపోయింది. కొత్త విడుదల తేదీని ఇంతవరకూ ప్రకటించలేదు.
ఈ శుక్రవారం విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. పనిలో పనిగా ‘గుర్తుందా శీతాకాలం’ కూడా ఈ వీకెండ్ లోనే వచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం ఫిల్మ్ నగర్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలతో పోటీ పడటం ఇష్టంలేక దీనిని వాయిదా వేసి ఉండొచ్చనీ కొందరంటున్నారు. అదే నిజమైతే, కనీసం కొత్త రిలీజ్ డేట్ ను అయినా ఇప్పటికే ప్రకటించాల్సింది. ఆ పని కూడా చేయలేదు. ఈ చిత్ర దర్శకుడు నాగశేఖర్ తో పాటు నిర్మాతలూ కొత్తవాళ్ళు కావడంతో ఈ మూవీకి రావాల్సిన బజ్ రాలేదనే మాట కూడా వినిపిస్తోంది. బట్ ఇది కన్నడ హిట్ మూవీకి రీమేక్ కావడం వల్ల కొంతలో కొంత పాజిటివ్ టాక్ మూవీ మేకింగ్ సమయంలో వచ్చింది. కానీ ఇలా పలుసార్లు విడుదల వాయిదా వేస్తుండటంతో ఆ టాక్ సైతం డైల్యూట్ అయిపోతోంది. ఇటీవల విడుదలైన సత్యదేవ్ ‘గాడ్సే’ సినిమా థియేటర్లలో పెద్దంత కలెక్షన్లను వసూలు చేయకపోవడం కూడా ‘గుర్తుందా శీతాకాలం’ విడుదలపై పరోక్షంగా ప్రభావం చూపించిందనే చెప్పాలి. ఏదేమైనా… గత కొంతకాలంగా ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా… ఓటీటీలో అయినా విడుదలైపోతే… ఈ ప్రాజెక్ట్ కు శుభం కార్డు పడినట్టు అవుతుంది.