గ్లామరస్ హీరోయిన్‌గా పేరొందిన రెజీనా కసాండ్రా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, పరిశ్రమలో నెలకొన్న వాస్తవాలు గురించి బహిరంగంగా మాట్లాడారు. ‘ఇండస్ట్రీలో ఇప్పుడు టాలెంట్ కన్నా పీఆర్, సోషల్ మీడియా మీదే అవకాశాలు ఆధారపడి ఉంటున్నాయి’ అని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
‘ నాకు ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేదు. ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఎదిగాను. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో సెట్‌కు వెళ్లడం, నటించడం, వచ్చేయడం.. ఇంతే అనుకునేదాన్ని. పీఆర్, సోషల్ మీడియా.. ఇవేవీ అవసరం లేదు అనుకునేదాన్ని. ముఖ్యంగా సోషల్ మీడియా మాయ అని భావించేదాన్ని. కానీ ఆలోచన మారింది. ఇండస్ట్రీ కూడా మారింది. ఇక్కడ హీరోయిన్ గా బతకాలంటే, నటనతో పాటు ప్రచారం కూడా అవసరం అని. సోషల్ మీడియాలో క్రేజ్ కూడా చాలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అని అర్ధం అయింది. కానీ 2015-16 లో నా కెరీర్ దారుణంగా ఉంది, సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్న. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక ఇక వెళ్లిపోవాలనుకున్న. కానీ 2018లో మళ్లీ బ్రేక్ దొరికింది. అప్పటి నుంచి విభిన్న పాత్రల పై దృష్టి పెట్టాను. మొదట నాకు తెలుగు రాదు. అందుకే డైలాగులు మార్నింగ్ ఇచ్చేవాళ్లు. వాటిని కంఠస్థం చేసి నటించడం చాలా కష్టంగా ఉండేది. కానీ మెల్లిగా నేర్చుకున్నా. ఇప్పుడు తెలుగులో మాట్లాడగలుగుతున్నా’ అంటూ తన పట్టుదలను వివరించింది.