సంజయ్ దత్ అప్పట్లో ‘వాస్తవ్’ అనే సినిమాలో నటించాడు. సినిమా సంగతి ఎలా ఉన్నా వాస్తవంలో మాత్రం ‘మున్నాభాయ్’ జీవితం ముచ్చెమటలు పట్టించే విస్మయాల సమాహారం! అటువంటి ‘సంజు బాబా సత్యాలు’ ఇప్పుడు కొన్ని పరికిద్దాం…
సంజయ్ దత్ 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అరెస్ట్ అయ్యాడు. మారణాయుధాలు దాచినందుకు జైలు శిక్ష అనుభవించాడు. అయితే, ఆయన ఊచలు లెక్కిస్తున్న సమయంలో పిల్లలిద్దరూ చిన్నవాళ్లు. వారికి తన శిక్ష గురించి తెలియకూడదని భావించిన దత్ కొండ ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నానని అబద్ధం చెప్పేవాడట. భార్య మాన్యతా కూడా అదే చెబుతూ, ‘నెట్ వర్క్ లేదని’ సముదాయించి ఫోన్ చేయకుండా ఆపేదట. పిల్లలకి కొంచెం తెలివి వచ్చాక జైలు జీవితం గురించి అసలు నిజం చెప్పాడట సంజయ్ దత్!
హీరోగా మొదటి సినిమా చేస్తున్నప్పటికే సంజయ్ దత్ డ్రగ్స్ కి బానిసైపోయాడు. కాశ్మీర్ లో మూవీ షూటింగ్ కి ఫ్లైట్ లో వెళుతున్నప్పుడు అక్రమంగా కిలో హెరోయిన్ తీసుకెళ్లాడట! అదృష్టవశాత్తూ ఎవరూ పట్టుకోలేదని అంటాడు సంజయ్. ఎందుకంటే, ఆ రోజు అతడితో పాటూ ఆయన ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారట. ఒకవేళ డ్రగ్స్ తో దొరికి ఉంటే సంజునే కాదు ఆయన తోడబుట్టిన వారు కూడా జైలుకి వెళ్లి ఉండేవారు…
Read Also : శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు సెబీ భారీ జరిమానా
డ్రగ్సే కాదు సిగరెట్ తాగటం కూడా ఎవరూ ఊహించని వయసులో మొదలు పెట్టాడు ‘ఖల్ నాయక్’. 9 ఏళ్ల వయస్సులోనే పొగ గుప్పుమనిపించాడట. విషయం తెలుసుకున్న సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ రూంలోకి తీసుకెళ్లి బెల్టుతో వాతలు తేలేలా కొట్టాడట!
డ్రగ్స్, సిగరెట్ లాంటివే కాదు… సంజయ్ దత్ అంటే ఎవరికైనా రొమాంటిక్ ఎఫైర్లు గుర్తుకు వస్తాయి. మాధురీ దీక్షిత్ తో రియల్ లైఫ్ రొమాన్స్ కి ముందు టీనా మునిమ్ తో సరసాలు సాగించాడు. అయితే, వివిధ కారణాల వల్ల టీనా బ్రేకప్ చేసుకుంది. అది నచ్చని సంజు బాబా కి రీషీ కపూర్ పైన కోపం వచ్చింది! ఎందుకంటే, సంజయ్ ని వదిలేసిన తరువాత రీషీతో టీనా ఎఫైర్ సాగిస్తోందని ఆయనకు తెలిసిందట. వెంటనే తన మిత్రుడు, నటుడు గుల్షన్ గ్రోవర్ ను వెంటదీసుకుని కపూర్ ఇంటికే వెళ్లాడట. బాగా చితగొట్టేదామని వారి ప్లానింగ్! కానీ, రిషీ కపూర్ ఇంటికి వెళ్లిన సంజయ్ దత్ కి నీతూ సింగ్ ఎదురొచ్చింది. అప్పటికే రిషీ, నీతూకి ఎంగేజ్ మెంట్ అయిపోయింది. దాంతో టీనా మునిమ్ కి, రీషీకి మధ్య ఏమీ లేదని నీతూ సింగ్ చెబితే వెనక్కి వచ్చేశారట సంజయ్ దత్, గుల్షన్ గ్రోవర్!
సంజయ్ దత్ యాక్టర్ అయింది కూడా వింతగానే! ఆయన యాక్టర్ అవ్వాలని కలలు కనలేదు. పెద్దగా ఆసక్తి కూడా లేదు. కానీ, చదువుకోవటం తప్పుతుందని ముఖానికి మేకప్ వేసి, కెమెరా ముందుకొచ్చేశాడు! అంతే…
ఎన్ని బలహీనతలున్నా సంజయ్ దత్ చాలా మంచివాడని చెప్పేవారే ఇండస్ట్రీలో ఎక్కువ! అందుకు ఎన్నో ఉదాహరణలు! సంజయ్ మూడో భార్య మాన్యత ఒకప్పుడు స్ట్రగులింగ్ యాక్ట్రస్. డబ్బులకి బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు మిస్ మాన్యతా ఓ లో బడ్జెట్ సినిమా చేసింది. ‘లవ్వర్స్ లైక్ అస్’ అనే సదరు చిత్రంలో ఆమె శృంగార సన్నివేశాల్లో ఘాటుగా నటించాల్సి వచ్చిందట. ఆ విషయం పెళ్లి తరువాత తెలుసుకున్న సంజయ్ దత్ సినిమా నిర్మాతల్ని పిలిచి, మాట్లాడి… అన్ని రకాల హక్కుల్నీ కొనేశాడు! సినిమా ఇక ఎప్పటికీ బయటకు రాకుండా, మాన్యత మానం చెదరకుండా చూసుకున్నాడు!
చాలా మంది స్టార్స్ తో పోలిస్తే సంజయ్ దత్ లో ఒక పెద్ద తేడాని మనం గమనించవచ్చు! ఆయన తన తప్పుల్ని కప్పి పుచ్చుకోవాలని ప్రయత్నించటం ఎప్పుడో మానేశాడు. చేసినవన్నీ ఒప్పుకుంటూనే పశ్చాత్తపం ప్రకటిస్తాడు. మరెవరూ తనలా చేయవద్దని హితవు పలుకుతాడు! బహుశా, ఆ నిజాయితీయే… ఆయన్ని రీసెంట్ గా బయటపడ్డ క్యాన్సర్ తో అన్ని రకాల సవాళ్ల నుంచీ ఇంతకాలంగా కాపాడుతూ వస్తోందని మనం అనుకోవాలి…