మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుండి రెండవ పాట విడుదలైంది. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ ‘బెల్లా బెల్లా’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా, మేకర్స్ రెండవ పాట ‘అద్దం ముందు’ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ప్రోమోతో ఆకట్టుకున్న ఈ పాట, పూర్తి స్థాయిలో అద్భుతమైన మెలోడీగా శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.
Also Read :New Celeb Trend : పెళ్లయ్యాక విడాకుల కంటే ముందే విడిపోవడమే బెటర్
భీమ్స్ సిసిరోలియో ఈసారి కూడా మధురమైన మెలోడీని అందించారు. ఆకర్షణీయమైన బీట్‌లు పాటకు ప్రత్యేకతను జోడించాయి. బాలీవుడ్ ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ మధురమైన గాత్రం పాటకు డెప్త్, మ్యాజిక్‌ను జోడించింది. ఆమెతో పాటు కపిల్ కపిలాన్ గానం కూడా అంతే అద్భుతంగా ఉంది. గీత రచయిత చంద్రబోస్ హృదయాన్ని హత్తుకునే పదాలతో ప్రేమలోని సున్నితమైన అందాన్ని పట్టుకున్నారు. ఈ పాటలో.. ఒకరిపై ఒకరు గాఢంగా ప్రేమ పెంచుకున్న భార్యాభర్తలు, తమదైన ప్రపంచంలో మునిగి తేలుతూ, ప్రతి క్షణాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు. భార్యాభర్తలందరూ తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఈ కొత్త మెలోడీని ఉపయోగించవచ్చు. ‘అద్దం ముందు’ పాట వినడానికి ఎంత బాగుందో, చూడటానికి అంతకంటే కన్నుల పండుగలా ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటను అందమైన యూరోపియన్ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. రవితేజ, డింపుల్ హయతి మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీని ఈ పాట హైలైట్ చేసింది. వారిద్దరి రొమాంటిక్ సన్నివేశాలు, సున్నితమైన చూపులు, సరదా సంభాషణలు పాట స్థాయిని పెంచాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సంక్రాంతి 2026 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.