బాలీవుడ్ లో చాలా మంది నటీనటులు రాజ్ కుమార్ హిరానీతో పని చేయాలని కోరుకుంటారు. అటువంటి టాలెంటెడ్, సెన్సిటివ్ డైరెక్టర్ ఆయన. అయితే, ప్రస్తుతం హిరానీ అభిమానులతో పాటూ కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందట. షారుఖ్ తో రాజ్ కుమార్ హిరానీ చిత్రం అంటూ చాలా రోజులుగా టాక్ వినిపిస్తున్నా ఇప్పుడు కన్ ఫర్మ్ గా షెడ్యూల్స్ గురించిన సమాచారం వినిపిస్తోంది…
లాక్ డౌన్ వల్ల మధ్యలో ఆగిపోవటంతో ఈ మధ్యే మళ్లీ ‘పఠాన్’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు బాలీవుడ్ బాద్షా. అయితే, ఆ సినిమా పూర్తవ్వగానే హిరానీ చిత్రంలోనే ఎస్ఆర్కే కనిపిస్తాడని బాలీవుడ్ టాక్. సెప్టెంబర్ లో మొదలయ్యే కామెడీ ఎంటర్టైనర్ జనవరి 2022 దాకా కొనసాగనుంది. ఇక షారుఖ్, రాజ్ కుమార్ హిరానీ సినిమాలో ఫీమేల్ లీడ్ గా తాప్సీ లక్కీ ఛాన్స్ కొట్టేసింది! కొంత కాలంగా తన నటనతో ఆకట్టుకుంటోన్న ఆమెకి హీరో అండ్ డైరెక్టర్ ఇద్దరితోనూ ఇదే తొలి చిత్రం అవ్వనుంది!
షారుఖ్ ఖాన్ లిస్ట్ లో ‘పఠాన్’, రాజ్ కుమార్ హిరానీ సినిమాలే కాకుండా తమిళ దర్శకుడు అట్లీతోనూ ఒక సినిమా ఉంది. ఆలియా భట్ తో కలసి ‘డార్లింగ్స్’ అనే సినిమా కూడా ఆయన చేయాల్సి ఉంది. అన్నిటి కంటే ముందుగా వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో యశ్ రాజ్ వారి యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’ రానుంది…