రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతానికి గ్లోబ్ ట్రాటర్ అనే పేరుతో సంబోధించబడుతున్న ఈ సినిమా, అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి సినిమా అనౌన్స్ చేయడం చాలా ఆలస్యమైంది. కానీ, రాజమౌళి – మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు అనే విషయం మీడియా లీకుల ద్వారా ప్రజలందరికీ తెలిసిపోయింది. అప్పటినుంచి ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఇక, ఈ సినిమా గురించి ఒక మొట్టమొదటి ఈవెంట్ నిర్వహించడానికి రాజమౌళి సిద్ధమయ్యాడు.
ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఈవెంట్ నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దాదాపుగా ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయి. ఇక ఈవెంట్ లైవ్ ఫీడ్ బయటకు ఇవ్వడం లేదు. కేవలం జియో హాట్‌స్టార్‌లో వీక్షించేలా ఇప్పటికే ఈవెంట్‌కి సంబంధించిన రైట్స్ కూడా అమ్ముడయ్యాయి. మీడియా సహా, ఫ్యాన్స్‌కి ఎవరికీ ఫోన్లు అనుమతించకుండా లోపలికి తీసుకువెళ్లాలని తొలితరం భావించారు. అయితే, ఇప్పుడు ఈవెంట్ నిర్వహణ విషయంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఒక భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. పదికి పైగా మరణాలు సంభవించాయి. ఉగ్రవాద చర్య అని అనుమానిస్తున్న రక్షణ బలగాలు ఇప్పటికే హైదరాబాద్ సహా మెట్రో నగరాలన్నింటినీ తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున చెకింగ్స్ నిర్వహిస్తూ, రద్దీగా ఉండే ప్రదేశాలపై ఫోకస్ పెడుతున్నారు.
Also Read:Spirit: చిరు లేడు కానీ.. షాకింగ్ కాంబో లోడింగ్
ఇలాంటి తరుణంలో, లక్షలాదిమంది అభిమానులు హాజరవుతారని అంచనా ఉన్న ఈవెంట్‌కి అనుమతి ఇవ్వడం అనేది దాదాపుగా అసంభవం అని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో జరుగుతున్న ఏ బహిరంగ వేదికకు, వేడుకకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో, ఈ కార్యక్రమానికి అనుమతి ఇస్తారా అనే అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే, తాజాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఇప్పటికే వేడుకకు సంబంధించిన రైట్స్ కొనుగోలు జరిగిపోయింది కాబట్టి, వేడుక రద్దు కాకుండా అవసరమైతే క్లోజ్డ్ ఈవెంట్‌గా నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫ్యాన్స్ ఎవరూ రాకపోయినా, మీడియా లేకపోయినా కేవలం సినిమా టీమ్ హాజరై ఈవెంట్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి, దాదాపుగా ఈవెంట్ రద్దు అయ్యే అవకాశాలు అయితే లేవు. కానీ, ఫ్యాన్స్‌కి అనుమతి మాత్రం ఉండకపోవచ్చు. ఈ విషయంలో మహేష్ అభిమానులు ముందే ప్రిపేర్ అయిపోతే బెటర్ అని సమాచారం.