తెలుగు సినీ పరిశ్రమలో పాడుతా తీయగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సినీ పరిశ్రమ మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్ అందరికీ ఈ షో గురించి దాదాపుగా తెలుసు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో ఎన్నో సీజన్ల పాటు విజయవంతంగా కొనసాగింది. ఎంతోమంది ప్లేబ్యాక్ సింగర్స్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. అయితే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా మృతి చెందిన తర్వాత ఈ షో వేరే ప్రొడక్షన్ హౌస్‌కి వెళ్లడంతో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి ఈ షోకి సంబంధించిన 25వ సీజన్ కొనసాగుతోంది. కీరవాణి, సునీత, చంద్రబోస్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షోలో సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేసింది. ఈ సీజన్‌లో తనకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసింది. నిజానికి ఆమె చిన్న వయసు నుంచి ఈ షోలో అనేక సీజన్లలో పాటలు పాడుతూ వస్తోంది. సింగర్‌గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకమ్మ, చిత్ర వంటి వారి నుంచి ప్రశంసలు అందుకుంటూ వస్తున్నాను అని చెబుతోంది.
పాడుతా తీయగా షోలో జడ్జిలు, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌తో పాటు కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్ తనను ఇబ్బంది పెట్టారని ఆమె వీడియోలో పేర్కొంది. మాకు మ్యూజిక్ ఫీల్డ్‌కి ఇక సంబంధం లేదని ఫిక్స్ అయ్యాకే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది నేను ఈ వీడియో చేయడం ఆపాలని చూశారు. నిజానికి ఆ షోలో జడ్జిలను ఒక చీడపురుగులా చూసే వాళ్లు, నేను ఎందుకు పనికిరాను అన్నట్టు మాట్లాడేవాళ్లు. ఇలాంటి మాటలు జడ్జిల నుంచి నేను ఊహించలేదు. నా బాడీ మీద కూడా జోక్స్ వేసేవారు. చాలామంది పెద్ద సింగర్స్ కూడా నన్ను పొగిడారు, కానీ వీళ్లు నన్ను ఇలా అంటున్నారు. ప్రొడక్షన్ వాళ్లు నన్ను చాలా తిప్పేవాళ్లు. బొడ్డు కిందకు చీర కట్టమని, ఎక్స్‌పోజింగ్ చేయమని ఇచ్చేవారు. ఆ విషయాన్ని నేను చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పుకొచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఇలాంటివి లేవు. జ్ఞాపికా ప్రొడక్షన్స్ ఈ షో చేయడం మొదలుపెట్టిన తర్వాత నుంచి ఇలాంటివన్నీ జరగడం మొదలయ్యాయి.
మమ్మల్ని డాన్స్‌లు చేయమని, కుళ్ళు జోకులు వేయమని టార్చర్ పెట్టేవారు. నన్ను కూడా డాన్స్ చేయమని బలవంతం చేశారు. సునీత అయితే నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. స్టేజి మీదకు ఎందుకు వచ్చిందా అని ఫేస్ పెట్టేవాళ్లు. సింగింగ్ కెరీర్ వదిలేద్దామని డిసైడ్ అయ్యాక ఇలా మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడిన తర్వాత నాకు చాన్స్ ఇవ్వరని తెలుసు, కానీ ఇలాంటి ఫ్రాడ్ షోలు చూడడం ఆపేయండి. నాకు ఏం జరిగినా, మా ఫ్యామిలీకి ఏం జరిగినా సునీత, చంద్రబోస్, కీరవాణి, జ్ఞాపికా ప్రొడక్షన్స్ అనిల్ కారణం అంటూ ఆమె ఆరోపించింది.