ఒక దర్శకుడు క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ లో తనే అన్ని సినిమాలను తెరకెక్కించాలి అనే రూల్ ఉందా? ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఇదే పాయింట్ ఫాలో అవుతున్నాడు. పీవీసీయూ (PVCU) లో కథ, క్యారెక్టర్స్, యూనివర్స్ ని ఆయన క్రియేట్ చేస్తూ.. డైరెక్షన్ మాత్రం ఇతర దర్శకులకి అప్పగిస్తున్నాడు, ఎందుకు?
ఒక సినిమా హిట్ అవ్వగానే, ఆ బ్రాండ్ ని వాడుకొని ఒక యూనివర్స్ ని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. అలా క్రియేట్ అయిందే పీవీసీయూ. ఇందులో ఆయన ప్రకటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ, వాటిలో ఏవీ తను డైరెక్ట్ చేయడం లేదు. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది ‘మహాకాళి’. భూమి శెట్టి టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ మైథలాజికల్ సూపర్ హీరో మూవీని పూజా కొల్లూరు తెరకెక్కిస్తోంది. ఇక ప్రశాంత్ వర్మ మాత్రం ఈ సినిమాకు డైరెక్టర్ గా కాకుండా, షో రన్నర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఇలాగే వస్తున్న మరో మూవీ ‘అధీర’. కళ్యాణ్ దాసరి సూపర్ హీరోగా, ఎస్.జె. సూర్య విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ‘జాంబీ రెడ్డి 2’ పేరు కూడా ఈ లిస్ట్ లో వినిపిస్తోంది. సుపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తూ ఉండగా, తేజా సజ్జా మరోసారి హీరోగా కనిపించనున్నాడు. షనాయ కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుంది.
ప్రశాంత్ వర్మ తన యూనివర్స్ లోని సినిమాలకు దర్శకత్వం ఎందుకు వేరే దర్శకులకు ఇస్తున్నాడు? ఒక్క సినిమా మీదే పూర్తిగా ఫోకస్ చేయకుండా, ఒకేసారి పలువురు సూపర్ హీరోలను పరిచయం చేస్తూ, యూనివర్స్ ను వేగంగా విస్తరించాలన్నదే ఈ స్ట్రాటజీగా కనిపిస్తోంది. అయితే, ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్న ఈ సినిమా, పీవీసీయూలో కీలకమైన నెక్స్ట్ చాప్టర్.

