తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్ తర్వాత సిద్దార్థ్ తో చేసిన ‘బావ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఎక్కువగా కన్నడ తెలుగు, తమిళ భాషల్లో నటించే ఈ భామ సైలెంట్ గా వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. వ్యాపారవేత్త నితిన్ రాజును మే 31న వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రణీత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై స్పందించారు. కరోనా పరిస్థితులు, ఆషాడం వల్ల తన పెళ్లి ఆడంబరంగా జరుపుకోలేకపోయానని కొత్త పెళ్లికూతురు ప్రణీత చెప్పుకొచ్చింది. కొద్ది మంది బంధువుల సమక్షంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వివాహం జరిగిందని ప్రణీత చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఈ కొత్త పెళ్లి కూతురు ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించింది. ప్రణీత ఫౌండేషన్ ద్వారా బెంగుళూరులో ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఈరోజు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య నిర్వహించబోతున్నారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లకు మాత్రమే వ్యాక్సినేషన్ వేయనున్నారు.