Fauzi : పెళ్లి పీటలెక్కిన రెబల్ స్టార్.. కానీ ?

Prabhas’ Fauzi Update

Prabhas’ Fauzi Update

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రియల్ లైఫ్‌లో డార్లింగ్ పెళ్లి భాజా ఎప్పుడు మోగుతుందో తెలియదు కానీ.. రీల్ లైఫ్‌లో మాత్రం మన రెబల్ స్టార్ పెళ్లి పీటలెక్కేశాడు! అవును, ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఒక సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతున్నది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ తాజా షెడ్యూల్‌లోనే ఒక భారీ వెడ్డింగ్ సీక్వెన్స్‌ను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్‌లో ప్రభాస్, టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతున్న సోషల్ మీడియా సెన్సేషన్, బ్యూటీ ఇమాన్వీల వివాహ ఘట్టాన్ని అత్యంత ఘనంగా తెరకెక్కిస్తున్నారు. ఈ గ్రాండ్ మ్యారేజ్ సీక్వెన్స్ కోసమే నవంబర్ 7వ తేదీన ప్రభాస్ సెట్స్‌లో అడుగుపెట్టాడు.

ఒక భారీ సెట్‌లో, కళ్లు చెదిరే ఆర్ట్ వర్క్‌తో ఈ పెళ్లి తంతును హను రాఘవపూడి తనదైన పొయెటిక్ స్టైల్‌లో చిత్రీకరిస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్. స్వాతంత్ర్యానికి పూర్వం పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ప్రేమకథలో ప్రభాస్ మిలిటరీ కల్నల్ పాత్రలో కనిపిస్తున్నాడు. సాంప్రదాయ బద్ధంగా, పాతకాలం నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా సాగే ఈ వెడ్డింగ్ సీక్వెన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ట్రీట్‌లా ఉండబోతోందట. అసలే లాంచింగ్ ఈవెంట్‌లో ప్రభాస్, ఇమాన్వీల పెయిర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ వర్కవుట్ అయితే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా వీళ్లిద్దరి పెళ్లి సీన్‌ను షూట్ చేస్తున్నారన్న వార్త బయటికి రావడంతో.. ఆన్ స్క్రీన్ మీద డార్లింగ్ పెళ్లి కొడుకు గెటప్ ఎలా ఉండబోతోందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి రియల్ లైఫ్ మ్యారేజ్ సంగతి పక్కనపెడితే, ‘ఫౌజీ’ సెట్స్‌లో ప్రభాస్ పెళ్లి మాత్రం అదిరిపోనుందని ఈ లీకైన న్యూస్ స్పష్టం చేస్తోంది!