పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’. హిందీ బ్లాక్ బస్టర్ ‘పింక్’ రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో నటించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించింది. తాజాగా ఈ ‘వకీల్ సాబ్’పై పీపుల్స్ జడ్జి వి. గోపాల గౌడ ప్రశంసలు కురిపించారు. ‘సాధారణంగా సినిమాలు ఒక వ్యక్తి లేదా కుటుంబం, ఇతిహాసం, కల్పిత కథల నేపథ్యంలో వస్తాయి. కానీ దేవదాస్ చిత్రం పవిత్ర ప్రేమని, స్త్రీ, పురుష బంధాన్ని ఒక నూతన కోణంలో చూపించింది. అందుకే అది భారతదేశంలో ఇప్పటికీ అత్యుత్తమ కావ్యంగా నిలిచిపోయింది. ఇన్నాళ్ళకి ‘వకీల్ సాబ్’ రూపంలో ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలపై న్యాయ పోరాటంగా ఒక చిత్రం వచ్చింది. మహిళల హక్కుల కోసం పోరాటం చేసే యోధుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి నటన అత్యద్భుతం’ అంటూ జడ్జి గోపాల గౌడ చిత్రబృందాన్ని అభినందించారు. ఈ మేరకు జడ్జి గోపాల గౌడ చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ రాసిన ఒక లెటర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.