ఏపీ రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని… ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రివర్యులకు వివరించారు.
Also Read:Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్.. జనసేన నేతకు పవన్ షాక్?
ఈ సందర్భంగా తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం… తదితర అంశాలు చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు.
Also Read:Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో?
ఈ ప్రకటన వెనక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనుక గల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దన్నారు. నిర్మాతలను కావచ్చు, నటులను కావచ్చు, దర్శకులను కావచ్చు… బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకొని వ్యాపారాలు సాగించాలనుకొనే అనారోగ్యకర వాతావరణానికి తావు ఇవ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందని అన్నారు.