విభిన్న సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయింది.
తోలి ఆట నుండి బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ సినిమా తోలి రోజు రూ. 12.7 కోట్లు కొల్లగొట్టి అద్భుతమైన స్టార్ట్ అందుకుంది. ఇక ఇటీవల 25 రోజుల థియేటర్ రన్ కంప్లిట్ చేసుకుంది లక్కీ భాస్కర్. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకోగా ఈ సినిమాను ఈ నెల 30న స్ట్రీమింగ్ కు తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం థియేటర్స్ లో లక్కీ భాస్కర్ స్టడీగా కలెక్షన్స్ రాబడుతోంది. రిలీజ్ అయిన కేవలం మూడు వారాల్లోనే లక్కీ భాస్కర్ రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే దుల్కర్ సినీ కెరీర్ లో మొట్ట మొదటి వంద కోట్ల సినిమాగా లక్కీ భాస్కర్ నిలవడం విశేషం.