AVM: జమున ఫిల్మ్ కెరీర్ లో ఒకే సంస్థలో వరుసగా రెండు ప్రమాదాలు జరిగాయి. అందులో ఒకటి తమిళ ‘లేత మనసులు’ చిత్రంలో పాట చిత్రీకరణ సందర్భంగా జరిగింది. దాని కారణంగానే ఆమె ఆ తర్వాత మెడ నొప్పితో బాధపడుతూ ఉండేవారు. అలానే మరొకటి ‘నాది ఆడజన్మే’ సినిమాలో పాట చిత్రీకరణలో జరిగింది. ఈ రెండు సినిమాలను నిర్మించింది ఏవీయమ్ సంస్థే కావడం విశేషం. అలానే రెండు ప్రమాదాలు సాంగ్స్ పిక్చరైజేషన్ టైమ్ లోనే జరగడం యాదృచ్ఛికం. మొదటి సినిమాలో జమున సరసన జయశంకర్ హీరోగా నటించగా, రెండో సినిమాలో ఎన్టీయార్, సావిత్రి ప్రధాన జంట.
‘నాది ఆడజన్మే’ సినిమాలో ఎన్టీయార్ తమ్ముడిగా హరనాథ్, సావిత్రి చెల్లిగా జమున నటించారు. వీరి మీద ‘నా మాట నమ్మితివేలా, నా మీద కోపమదేలా’ అనే పాటను బెంగళూర్ శాసనసభ ఎదురుగా ఉన్న కబ్బన్ పార్క్ లో తీయడానికి ప్లాన్ చేశారు. హరనాథ్ స్కూటర్ మీద జమునను ఎక్కించుకుని పార్క్ లోని ఫౌంటెన్ చుట్టూ చక్కర్లు కొట్టే షాట్ అది. రిహార్సిల్స్ జరుగుతున్నప్పుడే ఎందుకో డౌట్ వచ్చి జమున హరనాథ్ ను ‘స్కూటర్ డ్రైవింగ్ బాగానే వచ్చా’ అని అడిగారట. ‘భలే వారే మేడమ్. మీరు ధైర్యంగా కూర్చోండి’ అని హరనాథ్ భరోసా ఇచ్చారట. కానీ టేక్ లో హరనాథ్ తడబడి పోవడంతో వెనక కూర్చున్న జమున జారిపోయి… పక్కనే ఉన్న మెట్ల మీద పడిపోయారు. అప్పట్లో ఎన్టీయార్, ఎయన్నార్ కు తన హైట్ సరిపోవడంతో ఆమె హైహీల్స్ వేసుకునే వారు కాదు. కానీ హరనాథ్ వాళ్ళిద్దరికంటే కాస్తంత పొడుగు కావడంతో ఆమె కొద్దిగా ఎత్తు ఉన్న చెప్పులు వాడారు. ఆ హైహీల్స్ మధ్యన పాదం ఇరుక్కుని మెలికపడి పోయింది. జమున కుంటుకుంటూ కుర్చీలోకి చేరింది. కొద్ది సేపు షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి… ప్రధమ చికిత్స చేశారు. రాత్రి ఎక్స్ రే తీస్తే… ఎముక విరగలేదు కానీ చిట్లిందని తెలిసింది. దాంతో జమున పది, పదిహేను రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకే సంస్థ నిర్మించిన చిత్రాలలో, అదీ పాటల చిత్రీకరణ సమయంలోనే ఈ ప్రమాదాలు జరగడం చిత్రంగా అనిపిస్తుందని జమున చెబుతుండేవారు.