హీరో నాని ఆ మధ్య నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రధానంగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని సమర్పకుడిగా ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా తెరకెక్కిన ‘అ’, ‘హిట్’ చిత్రాలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి, ప్రేక్షకాదరణ సైతం పొందాయి. ‘అ’ మూవీతో ప్రశాంత్ వర్మ, ‘హిట్’తో శైలేష్ కొలను లను దర్శకులుగా పరిచయం చేసిన నాని, ఇప్పుడు తన అక్కయ్య దీప్తి గంటా చేతికి మెగా ఫోన్ ఇచ్చాడు.
అయితే… ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో వస్తోంది సినిమా కాదు! ‘మీట్ క్యూట్’ అనే ఆంధాలజీ!! ఆరుగురుగు మేల్ లీడ్స్, ఆరుగురు ఫిమేల్ లీడ్స్ తో ఇది రూపుదిద్దుకుంటోంది. దీని షూటింగ్ ను జూన్ లో మొదలు పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఐదు కథల సంకలనమైన ‘మీట్ క్యూట్’లో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే రోహిణి, అదాశర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానీశర్మ, సునైన, సంచిత పూనాంచ, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మ సూర్య, రాజా… ఇలా వేర్వేరు భాషలకు చెందిన నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ ఆంధాలజీకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.