నేచురల్ స్టార్ నాని హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.విజయ్ దేవరకొండ ముఖ్యపాత్ర పోషించగా, మాళవిక నాయర్, రీతు వర్మ హీరోయిన్‌లు గా నటించారు. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మార్చి 21న సినిమాని గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా విశేషాలు పంచుకున్నారు.
Also Read: Aditya 369 : రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆదిత్య 369’
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘పదేళ్ల కిందట చిన్న రిలీజ్‌గా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి మార్కులు పడినప్పటికీ ఎక్కువ రోజులు మాత్రం ఆడలేదు. అందుకే ఈసారి మరింత భారీగా విడుదల చేస్తున్నాం. మనకు కొన్ని సినిమాలతో ప్రత్యేకమైన ప్రేమ, అనుబంధం ఉంటుంది. తెలుగులో నాకు అలాంటి చిత్రాలు మూడు నాలుగు ఉంటాయి. ఇక ‘ఎవడే సుబ్రమణ్యం’ మూవీ చూసి ఈ సినిమా గురించి నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లలోనూ అలాంటి ప్రేమనే కనిపించింది. పదేళ్లకు ముందు తీసిన ఈ సినిమా అప్పటి పరిస్థితులకు ఎంత దగ్గరగా ఉండేదో..ఇప్పటికీ మనం అదే పరుగులలో ఉన్నాం. అందుకే ఈతరం ప్రేక్షకులకు ఈ సినిమాని చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మొత్తానికి రీ రిలీజ్ అవుతుంది. ఈసారి మరింత మంది ఈ చిత్రాన్ని చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నా’ అని తెలిపారు. అలాగే ఆయన ఈ పదేళ్ల తన ప్రయాణం సంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ‘ ప్రతి సినిమాని మరొకరు చేయలేని ఓ కొత్త కాన్సెప్ట్ తీస్తున్నా. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదలకు ముందు నాలో చాలా ఒత్తిడి ఉండేది. భారీ చిత్రం, ఎంతో బాధ్యత నాపై ఉంది. కానీ విడుదల తర్వాత ఫలితం ఎంతో తృప్తినిచ్చింది.ఇంతటి ఘన విజయం అందుకున్నందుకు ఆనందంగా ఉంది. ఓ మైలురాయి లాంటి సినిమా చేశాం. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయగలమనే నమ్మకం వచ్చింది. ‘కల్కి 2’ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఆ సినిమాని ప్రారంభిస్తాం. ఈసారి సినిమాలో ప్రభాస్ పాత్ర పరిధి ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది’ అని అన్నారు నాగ్ అశ్విన్.