‘మెగాస్టార్’ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరు సరసన నయనతార కథానాయికగా నటించారు. ఈరోజు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో పలు ప్రాంతాల్లో ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. తాజాగా ఓ అభిమాని భారీ ధరకు ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను దక్కించుకున్నారు.
మన శంకరవరప్రసాద్ గారు సినిమా ప్రీమియర్ షో టికెట్‌లను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని వెంకటరమణ థియేటర్‌లో ఈ వేలం పాట నిర్వహించారు. చిరంజీవి యువత ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వేలంలో మెగా అభిమాని, జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బారావు ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను రూ.1.11 లక్షలకు దక్కించుకున్నారు. ఈ డబ్బును చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుకు అందిస్తామని చిరు అభిమాన సంఘం నాయకులు తెలిపారు. వేలంలో మొదటి టికెట్ దక్కించుకున్న సుబ్బారావు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సుబ్బారావు పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.
అటు చిరంజీవి, ఇటు అనిల్ రావిపూడి కావడంతో మన శంకరవరప్రసాద్ గారుపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రోమోస్, సాంగ్స్, ట్రైలర్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో.. సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సినిమా నిడివిని 2 గంటల 42 నిమిషాలు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాతలు కాగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.