దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో సినీ సెలెబ్రిటీలు తమవంతు ప్రయత్నంగా ప్రజల్లో కరోనా జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మహేష్ బాబు ముందున్నారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు తన సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే ‘కోవిడ్‌తో పోరాడుతున్న వారికి సహాయపడటానికి మనం చేయగలిగిన ప్రతిదీ చేద్దాం. ప్లాస్మా దాతలు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవసరం. వీసీ సజ్జనార్ & సైబరాబాద్ పోలీసులు ఈ చొరవ తీసుకున్నందుకు నేను నా సపోర్ట్ ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అంటూ ప్లాస్మా దానం గురించి సైబరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు. తాజాగా తెలంగాణ స్టేట్ పోలీస్ తమ అధికారిక ట్విట్టర్ లో మహేష్ బాబు వీడియోతో ప్రజల్లో కరోనా అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. ‘జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బీ అలర్ట్. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్… వేర్ మాస్క్’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు. దానికి ‘మాస్క్ ఈజ్ మస్ట్’ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. కాగా రాష్ట్రంలో కొత్తగా 7432 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 387106 కు చేరింది. ఇందులో 3.26 లక్షల మంది డిశ్చార్జ్ కాగా, 58,148 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కొత్తగా కరోనాతో 33 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1961కి చేరింది.
#MaskIsMust@urstrulyMahesh pic.twitter.com/L4AzI0JBvO
— Telangana State Police (@TelanganaCOPs) April 24, 2021