మన టాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ల పరభాష భామల మోజు గురించి అందరికీ తెలిసిందేగా! ఎంత ఖర్చైనా పర్లేదు.. ఇతర రాష్ట్రాల నుంచి కథానాయికల్ని ఇంపోర్ట్ చేసుకుంటారే తప్ప, లోకల్ ట్యాలెంట్‌ని పెద్దగా పట్టించుకోరు. ఇబ్బడిముబ్బడిగా వాళ్ళు విచిత్రమైన డిమాండ్స్ చేసినా సరే, వాటిని తీర్చేందుకు సిద్ధమైపోతారు. మనోళ్ళ ఈ వీక్నెస్ చూసే.. పరభాష భామలు క్యాష్ చేసుకుంటుంటారు. సరిగ్గా మానుషీ ఛిల్లర్ కూడా అదే చేయాలనుకుంది. ఆఫర్స్ కోసం తనని వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి, భారీగా దండుకోవాలని చూసింది. అయితే, ఈ అమ్మడి ఫిగర్ మరీ ఎక్కువగా ఉండడంతో, నిర్మాతలు మరో దారి లేక యూటర్న్ తీసేసుకుంటున్నారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. పలు చిన్న బడ్జెట్ సినిమాల కోసం తెలుగు ఫిల్మ్‌మేకర్స్ మానుషీని సంప్రదించారట! తాను నటించేందుకు ఒప్పుకుంది కానీ, రెండున్నర కోట్లు ఇస్తేనే సంతకం చేస్తానని ఝలకిచ్చింది. బోనస్‌గా ఆమెకు అడిగిన డిమాండ్స్ అన్నీ పూర్తి చేయాలి. చిన్న సినిమాల బడ్జెట్ ఎంతుంటుందో అందరికీ తెలిసిందేగా! నిజానికి.. ఆమె అడిగిన మొత్తంలోనే ఒక మంచి సినిమా తీయొచ్చు. అందుకే, ‘నీకో దండం తల్లి’ అంటూ నిర్మాతలు వెనక్కు వచ్చేస్తున్నారు. వాస్తవానికి.. మానుషీ ఛిల్లర్ ఎంత అడిగింతో, అంత పారితోషికం దక్షిణాది స్టార్ నటీమణులు కూడా తీసుకోవడం లేదు. సమంత, పూజా హెగ్డే లాంటి స్టార్ భామలు ఇంకా రూ. 2 కోట్లే అందుకుంటున్నారు.
పోనీ.. మానుషీకి ఏమైనా స్టార్ స్టేటస్ ఉందా? అంటే, కేవలం ఒక్క సినిమా (పృథ్వీరాజ్) అనుభవమే ఉంది. మిస్ వరల్డ్ 2017గా క్రేజ్ పొందింది కానీ, నటిగా ఆమె ఇంతవరకూ తనదైన ముద్ర వేసింది లేదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమె గురించి పెద్దగా తెలీదు. కెరీర్ ప్రారంభంలోనే ఇలా భారీగా డిమాండ్స్ చేస్తే.. వచ్చే ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో పాటు భవిష్యత్తులో కెరీర్ అయోమయంగా తయారవ్వడం ఖాయం! చాలామంది ఇలా డిమాండ్స్ చేసే, తమ చేజేతులా కెరీర్లను నాశనం చేసుకున్నారు. కాబట్టి.. మానుషీ మరోసారి పునరాలోచన చేసుకుంటే బెటర్!