Sailesh Kolanu: సుహాస్ నన్ను మోసం చేశాడు..!

Sailesh Kolanu

Sailesh Kolanu

Sailesh Kolanu: సముద్రం నేపథ్యంలో సినిమా తెరకెక్కించడం అంత సులభమైన విషయం కాదని దర్శకుడు శైలేష్ కొలను అన్నారు. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. ఈ సినిమా కోసం చిత్రబృందం పడిన కష్టం, సముద్రంలో యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ, నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను థియేటర్లలో చూస్తేనే పూర్తి అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా థియేటర్‌కు వెళ్లాలంటే ప్రేక్షకులు ఎన్నో కారణాలు ఆలోచించే పరిస్థితి ఉందని చెప్పారు. అయితే ‘మండాడి’లో సూరి, సుహాస్ మధ్య జరిగే ఫేస్ ఆఫ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేంత ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. సముద్రం, పడవ పందెం నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని మేకర్స్ సృష్టించారని చెప్పారు.

ముఖ్యంగా సముద్రంలో షూటింగ్ చేయడం చాలా కష్టమైన విషయమని శైలేష్ అన్నారు. ఒక చిన్న సీక్వెన్స్ చిత్రీకరించడానికి కూడా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. పడవలను ఫాలో అవుతూ మరో పడవపై కెమెరాలతో చిత్రీకరించడం, సముద్రంలో పడవల కదలికలు మారడం, లైటింగ్ మారిపోవడం వంటి సమస్యల మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాల్సి వస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా మొత్తాన్ని సముద్రంలో చిత్రీకరించిన టీమ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఇక సుహాస్ గురించి మాట్లాడుతూ.. సుహాస్‌లో విలన్‌ని చూసిన చాలా కొద్ది మంది డైరెక్టర్స్‌లో నేను ముందు వరుసలో ఉంటాను. కానీ సుహాస్ నన్ను మోసం చేశాడు. ఆయనను మొదట విలన్‌గా దాచిపెట్టాలనుకున్నామని, కానీ తన నటనతో సినిమాకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారని శైలేష్ అన్నారు. ముఖ్యంగా తన హిట్ 2 సినిమాలో చివరి 15 నిమిషాల్లో సుహాస్, శేష్ చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. సుహాస్ తనకు కుటుంబ సభ్యుడితో సమానమని, ఆయన మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు.

ఇక ఈ సినిమా హీరోయిన్ మహిమా నంబియార్ విలేజ్ గర్ల్‌గా పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారని శైలేష్ తెలిపారు. అలాగే రవీంద్ర విజయ్, సత్యరాజ్ వంటి నటుల పెర్ఫార్మెన్స్‌ను ప్రశంసించారు. డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సహా మొత్తం టెక్నికల్ టీమ్ అద్భుతంగా పనిచేసిందన్నారు. ప్రస్తుతం సినిమాల మధ్య భాషల సరిహద్దులు చెరిగిపోయాయని, కంటెంట్‌నే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని శైలేష్ కొలను అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 10న ‘మండాడి’ని పెద్ద స్క్రీన్‌పై, ముఖ్యంగా ఎపిక్ ఫార్మాట్‌లో చూసి ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులను కోరారు.