ఒక సినిమా హిట్ కాగానే ఆ ఆ సినిమా లో భాగమైన వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్ల అయితే అవకాశాలు మరీ ఎక్కువగా లభిస్తుంటాయి. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ధనుష్ ‘కర్ణన్’ సినిమా హీరోయిన్ కి టాలీవుడ్ నుంచి ఆఫర్ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ‘ఖిలాడీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత శరత్ మండవ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా అనౌన్స్ చేశాడు. కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఇప్పటికే దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించారు. ఇప్పుడు మరో హీరోయిన్ గా ధనుష్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్న రజిష విజయన్ ను కూడా నటింప చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మలయాళ భామ 2016లో మలయాళ సినిమాతో తెరంగ్రేటం చేసింది. మలయాళంలో చేసిన సినిమాలకు గాను ఆమె పలు అవార్డులు కూడా అందుకుంది. అయితే తాజాగా ధనుష్ తో చేసిన సినిమా మాత్రం ఆమెకు అన్ని భాషల్లోను గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు రవితేజ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం లభించిందని అంటున్నారు.