దాదాపు రెండేళ్ళ క్రితం రూ. 1500 కోట్ల భారీ వ్యయంతో మూడు భాషల్లో, మూడు భాగాలుగా ‘రామాయణ’ చిత్రాన్ని నిర్మిస్తామని అల్లు అరవింద్, నితీష్ మల్హోత్ర, మధు మంతెన ప్రకటించారు. ఈ త్రీడీ మూవీని నితీశ్ తివారి, రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తారని చెప్పారు. అప్పటి నుండీ ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ సినిమాలో రాముడిగా ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తాడని, సీతగా దీపికా పదుకునే, రావణాసుడి పాత్రను హృతిక్ రోషన్ పోషిస్తారనే ప్రచారం జరిగింది. అయితే… 2019 డిసెంబర్ లో మొదలు కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో పట్టాలెక్కలేదు. ఆ తర్వాత కరోనాతో చిత్రసీమ కుదేలైపోయింది.
Read Also : నితిన్, షాలిని ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ… పిక్ వైరల్
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుండి మహేశ్ బాబు తప్పుకున్నాడని తెలుస్తోంది. వచ్చే యేడాది ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం షూటింగ్ మొదలు పెట్టాలని భావించిన నిర్మాతలు, ద్వితీయార్థంలో డేట్స్ ఇవ్వమని మహేశ్ బాబును కోరుతున్నారట. కానీ ఆ డేట్స్ ను ఇప్పటికే మహేశ్… దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో తాను హీరోగా రాజమౌళి తెరకెక్కించబోతున్న సినిమాకు ఇచ్చేశారట. పాన్ ఇండియా మూవీ ‘రామాయణ’మా లేక రాజమౌళి చిత్రమా అని అనుకున్నప్పుడు మహేశ్ బాబు రెండో సినిమా వైపే మొగ్గు చూపుడని తెలుస్తోంది. దాంతో శ్రీరాముడిగా నటించలేనని మహేశ్ బాబు నిర్మాతలకు చెప్పేశాడని అంటున్నారు. మరి వెండితెర సీత దీపికా పదుకొనే భర్త రాముడి పాత్రకు ఇప్పుడు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.