సూపర్ స్టార్ కృష్ణ మనవడు, జయదేవ్ గల్లా తనయుడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లో ‘హీరో’గా ఎంట్రీ ఇస్తున్నాడు. నిజానికి దిల్ రాజు లాంచ్ చేయాల్సిన అశోక్ ను ఇప్పుడు ఆయన తండ్రి జయదేవ్ గల్లానే ఓన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ ను, టీజర్ ను ప్రిన్స్ మహేశ్ బాబు విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. విశేషం ఏమంటే… ఫస్ట్ మూవీతోనే అశోక్ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడం ఖాయం అనిపిస్తోంది. టీజర్ చూస్తే కృష్ణ నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’, మహేశ్ బాబు ‘టక్కరి దొంగ’ చిత్రాలను తలపించే కౌబోయ్ మూవీ అనే భావన వీక్షకులకు కలుగుతుంది. అదే సమయంలో ‘జోకర్’ గెటప్ లో అశోక్ వెలిబుచ్చిన హావభావాలను చూస్తే ఆశ్చర్య కలుగుతుంది. ఈ కుర్ర ‘హీరో’లో విషయం ఉందనిపిస్తుంది. ఇక ఇతగాడి తొలి చిత్రానికే చిరంజీవి టైటిల్ ‘హీరో’ను పెట్టడం మరో విశేషం. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ‘హీరో’ మూవీ అతి త్వరలోనే విడుదల కానుంది. మరో విశేషం ఏమంటే… ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మూవీలోని ఓ పాపులర్ సాంగ్ నూ రీమిక్స్ చేస్తున్నారు.