ప్రముఖ దర్శకుడు కెవి ఆనంద్ మృతి సినీ ప్రముఖులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ కెవి ఆనంద్ ఈరోజు ఉదయం 3:30 సమయంలో హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన మరణించారు. రంగం, వీడోక్కడే చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కెవి ఆనంద్ ఇటీవల కాలంలో బ్రదర్స్, ఒక్క క్షణం, ఎక్కడికి పొతావు చిన్న వాడా, డిస్కో రాజా, బందోబస్త్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కెవి ఆనంద్ మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన మృతి పట్ల తెలుగు, తమిళ ఇండస్ట్రీల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రముఖ దర్శకుడు శంకర్ లతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కెవి ఆనంద్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
అల్లు అర్జున్ ఆయనకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. “కెవి ఆనంద్ గారు ఇక లేరనే విచారకరమైన వార్తతో ఈరోజు మేల్కొన్నాను. అద్భుతమైన కెమెరామెన్, తెలివైన దర్శకుడు. చాలా మంచి మనిషి. సర్ మిమ్మల్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం. రెస్ట్ ఇన్ పీస్ సర్’ అంటూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు అల్లు అర్జున్.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు… కేవీ ఆనంద్ మృతిపై స్పందిస్తూ “నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. కేవీ ఆనంద్ ఒక తెలివైన సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్. చాలా మంచి మనిషి, మంచి స్నేహితుడు. చిత్ర పరిశ్రమ అతన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అతని కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
ప్రముఖ దర్శకుడు శంకర్ స్పందిస్తూ ‘షాకింగ్ గా ఉంది. నా హృదయం చాలా భారంగా అనిపిస్తుంది. బాధాకరంగా ఉంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నా ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను. కె.వి. అద్భుతమైన సినిమాటోగ్రాఫర్, దర్శకుడు. ఈ నష్టాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేము. నా ప్రియమైన మిత్రుడిని నేను మిస్ అవుతాను. అతని కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.