‘మహానటి’ సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ ఖాతాలో మరో హిట్ లేదు. అటు హీరోలతో నటించిన సినిమాలో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఆడియన్స్ ను పూర్తిగా నిరాశపరిచాయనే చెప్పాలి. ఒక్క తమిళ ‘సర్కార్’ మాత్రమే పర్వాలేదనిపించింది. మిగిలిన అన్ని సినిమాలు పరాజయం పొందాయి. ప్రస్తుతం కీర్తి నటించిన ‘మరక్కార్, గుడ్ లక్ సఖి, అన్నత్తే’ సినిమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తమిళ ‘సాని కాయిదం, వాశి’ సినిమాలతో పాటు తెలుగులో ‘సర్కారువారి పాట, భోళా శంకర్’ సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి.
ఇటీవల కాలంలో వరసగా ‘పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన కీర్తిని మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా పలకరించబోతోందట. గత నెలలో విడుదలై మిక్స్ డ్ రివ్యూస్ తెచ్చుకున్న బాలీవుడ్ సినిమా ‘మిమి’ తెలుగు, తమిళ రీమేక్ వెర్షన్ లో నటించటానికి కీర్తి సురేష్ ని సంప్రదించారట. కృతి సనన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ లో స్టార్ కావాలని కలలు కంటున్న ఓ యువతి ఆర్థికపరమైన ఇబ్బందులతో ఓ అమెరికన్ దంపతుల కోసం సరోగేట్ మదర్ కావటానికి ఒప్పుకుంటుంది. అయితే పుట్టబోయే బిడ్డ మానసిక వైఫల్యంతో పుడతాడనే రిపోర్ట్ రావటంలో అమెరికన్ జంట వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. దాంతో గర్భం దాల్చిన యువత ఏం చేసింది. ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టిన బిడ్డను తీసుకువెళ్లడానికి వచ్చిన అమెకన్ జంట ఏ నిర్ణయం తీసుకుందనే అంశంతో ‘మిమి’ తెరకెక్కింది.
ఇది ‘మాలాఆయ్ వ్హయ్చీ’ అనే మరాఠీ సినిమాకి రీమేక్. నిజానికి 2013లో ఇదే సినిమా ‘వెల్కమ్ ఒబామా’ పేరుతో తెలుగులో రీమేక్ అయింది కూడా. అంతగా ప్రజాదరణకు నోచుకోలేదు. అందుకే కీర్తి స్టార్ డమ్ తో అయినా ఆడుతుందనే అభిప్రాయంతో ఇప్పుడు రీమేక్ చేసే ధైర్యం చేస్తున్నారట. చూద్దాం ఏం జరుగుతుందో!