బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కరోనా నుండి కోలుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా శనివారం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సంతోషకరంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ, తనకు తాజా పరీక్షలో నెగెటివ్ వచ్చిందని తెలిపింది. తనపై అభిమానంతో ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ కత్రినా కైఫ్ ధన్యవాదాలు తెలిపింది. గత కొంతకాలంగా ఆమె విక్కీ కౌశల్ తో రిలేషన్ షిప్ లో ఉందనే గుసగుసలు బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్నాయి. కానీ వాళ్ళిద్దరూ మాత్రం ఈ విషయమై పెదవి విప్పటం లేదు. అయితే వాళ్ళ ఔటింగ్స్, లేట్ నైట్ డిన్నర్స్ కు సంబంధించిన వార్తలు చాలానే వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే… ఆ మధ్య కరోనా బారిన పడిన విక్కీ కౌశల్ సైతం ఇప్పుడు కోలుకున్నాడు. ఇక కత్రినా కొత్త ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే… అలీ అబ్బాస్ జాఫర్ సూపర్ హీరో మూవీలో ఆమె నటిస్తోంది. అలానే అక్షయ్ కుమార్ సరసన నటించిన ‘సూర్యవంశీ’ విడుదల కావాల్సి ఉంది. గత యేడాది విడుదల కావాల్సిన ఈ సినిమాను ఈ సంవత్సరం ఏప్రిల్ కైనా రిలీజ్ చేయాలని దర్శకుడు రోహిత్ శెట్టి భావించాడు. కానీ మహారాష్ట్రలో థియేటర్లు మూసేసిన కారణంగా ఇప్పుడూ వాయిదా పడింది.