ప్రస్తుతం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి కన్నడ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న “కాంతార చాప్టర్-1”. నటుడు–దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ డివోషనల్ డ్రామా, ఇప్పటికే విడుదల కానుందన్న వార్తలతోనే విశేషమైన అంచనాలను క్రియేట్ చేసింది. గతంలో వచ్చిన కాంతార సినిమాకు వచ్చిన అపారమైన విజయాన్ని అందరూ గుర్తుంచుకున్నారు. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఆ సినిమా కేవలం కన్నడలోనే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో సంచలన హిట్టయింది. ముఖ్యంగా, కథలో ఉన్న కల్చరల్ రూట్స్, ఫోక్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా విజయం కారణంగా, ఇప్పుడు “చాప్టర్-1” పై మరింతగా అంచనాలు పెరిగాయి.
ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌కే పరిమితం చేయకుండా, గ్లోబల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో కాంతార మొదటి భాగం ఇంగ్లీష్‌తో పాటు ఇటాలియన్, స్పానిష్ భాషలో కూడా ఓటీటీ ద్వారా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ స్ట్రాటజీ కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు మేకర్స్ మరింత ధైర్యంగా అడుగు వేసి “కాంతార చాప్టర్-1”ను ఇంగ్లీష్ థియేట్రికల్ రిలీజ్ తో పాటు స్పానిష్ వెర్షన్‌లో కూడా విడుదల చేయాలని డిసైడ్ చేసినట్టు బజ్ వినిపిస్తోంది.
అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే.. నిజంగా ఈ ప్రయత్నం వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే ఇప్పటివరకు అనౌన్స్ చేసిన పలు పాన్ ఇండియా సినిమాలు వేర్వేరు భాషల్లో డబ్ అయిన, వాటి విడుదల సక్రమంగా జరగలేదు. అంతేకాకుండా, భాషా, సాంస్కృతిక వైవిధ్యం కారణంగా అన్ని భాషల్లోనూ సినిమా విజయం సాధించడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ, కాంతార లాంటి సినిమాకు ఉన్న నేటివ్ కనెక్ట్, యూనివర్సల్ ఇమోషన్స్ వలన గ్లోబల్ ఆడియెన్స్‌ని కూడా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. రిషబ్ శెట్టి ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం తన లుక్, ఫిజిక్‌పై శ్రద్ధ పెట్టి, పాత్రలోకి పూర్తిగా మలచుకున్నాడు. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుందని, ఆ తర్వాతే గ్లోబల్ రిలీజ్ ప్లాన్స్‌పై మరింత స్పష్టత వస్తుందని అంచనా. మరి, ‘కాంతార చాప్టర్-1’ గ్లోబల్ ఆడియన్స్ ముందు అదే మాయను మళ్లీ చూపుతుందా? లేక స్థానిక స్థాయిలో పరిమితం అవుతుందా? అన్నది చూడాలి.