ఇవాళ్టి ప్రేక్షకులు సినిమాలలో కథలను ఇష్టపడటం కంటే… వాటి కథనాలను ఇష్టపడుతున్నారు. స్టార్ హీరోలు, హ్యూజ్ సెట్టింగ్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోయినా, సింపుల్ కథను, ఆసక్తికరంగా తెర మీద చూపితే చాలు ఆనంద పడుతున్నారు. అలాంటి చిత్రమే ‘కాలా’. టొవినో థామస్, సుమేశ్ మూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఇప్పటికే మలయాళంలో విడుదలైంది. విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీని తెలుగు వర్షన్ ఆహాలో జూన్ 4న విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే… ఈ సినిమాలో బలమైన కథ లేకపోయినా… ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు.. చూస్తున్న ప్రేక్షకుడి మనసులో ఆ ఆలోచనే రాకుండా చేస్తాయి. ఓ కుక్క కారణంగా మొదలైన వివాదం చినికి చినికి గాలీవానగా మారుతుంది. ప్రారంభం నుండి ముగింపు వరకూ నాన్ స్టాప్ యాక్షన్ తో మూవీ సాగుతుంది. ఫారెస్ట్ హౌస్ లో ఒక రోజులో జరిగే కథ ఇది. కానీ ఎక్కడా అలా అనిపించదు… టొవినో, మూర్ ఇద్దరూ పోటీలు పడి మరీ… నువ్వా-నేనా అన్నట్టుగా నటించారు. అలానే ఇతర ప్రధాన పాత్రల్లో లాల్, దివ్యా పిళ్ళై కనిపిస్తారు. యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారిని విశేషంగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ తరం ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరిచేలా ఈ న్యూ యేజ్ మూవీని రోహిత్ వి. ఎస్. తెరకెక్కించాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్… ఓన్లీ యాక్షన్ అన్నట్టుగా సాగే ‘కాలా’ తెలుగువారికీ ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందని దర్శకుడు రోహిత్ చెబుతున్నాడు.