మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలో ఎంతటి ప్రమాదం దాగి ఉందో కళ్లకు కట్టేందుకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సిద్ధమైంది. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త మూవీ ‘ది ఇండియా స్టోరీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కోర్ట్‌రూమ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ పోస్టర్ చూస్తుంటే, సమాజంలో నిత్యం జరిగే ఒక భయంకరమైన నిజాన్ని వెండితెరపై చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముంబై హైకోర్టు బ్యాక్‌డ్రాప్‌లో డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంది. ఇందులో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కోర్టు కోటు ధరించి, ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపిస్తుండగా.. టాలెంటెడ్ యాక్టర్ శ్రేయస్ తల్పడే తన కూతురి భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతున్న ఒక సగటు తండ్రిగా కనిపిస్తున్నారు.
అయితే ఈ పోస్టర్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన అంశం.. కోర్టులో సాక్షుల బోనులో మనుషులకు బదులుగా ఒక పురుగుమందు సిలిండర్ ఉంచడం! ఆహార కల్తీ అనే అంశం చుట్టూ ఈ కథ తిరగబోతుందని చెప్పడానికి ఈ ఒక్క సీన్ చాలు. ఒక చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చిన కల్తీ మాఫియా గుట్టును రట్టు చేసేందుకు లాయర్ పాత్రలో కాజల్ చేసే పోరాటమే ఈ సినిమా అని తెలుస్తోంది. ఈ చిత్రానికి చెట్టన్ డీకే దర్శకత్వం వహిస్తుండగా, సాగర్ బి. షిండే కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. సినిమా గురించి డైరెక్టర్ మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, కల్తీ ఆహారం తిని తమకు తెలియకుండానే ప్రాణాలు కోల్పోతున్న ప్రతి ఒక్క భారతీయుడి కథ అని భావోద్వేగానికి గురయ్యారు. “మనం నిత్యం తినే అన్నం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల వెనుక ఎంతటి మాఫియా దాగి ఉందో, అది ప్రజారోగ్యాన్ని ఎలా గుల్ల చేస్తుందో ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాం. ఈ ‘ది ఇండియా స్టోరీ’ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తాము తినే ఆహారం పట్ల మరింత అప్రమత్తంగా ఉంటారు. సమాజంలో ఒక బిగ్ డిబేట్‌కు ఈ చిత్రం కారణం కాబోతోంది” అని డైరెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా జూలై 24, 2026న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

